బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 03:13:23

కరెన్సీకి ‘కరోనా’ సంకెళ్లు

కరెన్సీకి ‘కరోనా’ సంకెళ్లు
  • వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో కరెన్సీనోట్లను గిడ్డంగుల్లో దాచుతున్న చైనా
  • వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఉండేందుకేనని వెల్లడి
  • 1500 దాటిన కొవిడ్‌-19 మృతులు

బీజింగ్‌/అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 15: చైనాను  వణికిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆ దేశం కొత్త చర్యలు చేపట్టింది. వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో నగదు లావాదేవీలను నియంత్రించడానికి చర్యలు చేపట్టింది. నోట్ల చెలామణి వల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశముందని భావించిన చైనా ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నది. ఇదే సమయంలో వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో కరెన్సీ నోట్లు ఎక్కువగా చెలామణిలో ఉండకుండా నోట్లను భారీ ఎత్తున గిడ్డంగుల్లో భద్రపరుస్తున్నది. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వైస్‌ గవర్నర్‌ ఫాన్‌ వైఫీ మాట్లాడుతూ వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో నోట్లను కొంతకాలం పాటు గిడ్డంగుల్లో భద్రపరుస్తామని, ప్రధానంగా దవాఖానలు, మార్కెట్లలో నుంచి వచ్చే నగదును తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మధ్య జరిగే నగదు లావాదేవీలను కూడా రద్దు చేశామని, ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గిడ్డంగుల్లో భద్రపర్చిన నగదును పూర్తిగా పరిశీలించి, వీటి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేదని నిర్ధారించిన తర్వాతే మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని వివరించారు. 


చికిత్సలో రోబో టెక్నాలజీ వాడకం

కరోనా వైరస్‌ వల్ల చైనాలో మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 1,523కు చేరుకోగా.. మరో 143 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 66,000కుపైగా చేరుకుంది. కరోనా వైరస్‌ బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి కూడా వైరస్‌ సోకుతుండటంతో రోబో టెక్నాలజీ వాడకంపై దృష్టి సారించాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సూచించారు. మరోవైపు కరోనా వైరస్‌ నిర్మూలనకు వ్యాక్సిన్‌ను కనుగొనడానికి చర్యలు ప్రారంభించామని ప్రముఖ ఫార్మాసూటికల్‌ సంస్థ జైడస్‌ కాడిలా శనివారం తెలిపింది. ఇంకోవైపు కరోనాకు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్‌ నగరం నుంచి ఇటీవల స్వదేశానికి తీసుకొచ్చిన 650 మంది భారతీయుల్లో దాదాపు 406 మందికి ఇండో-టిబెటిన్‌ పోలీసుల శిబిరంలో ఆశ్రయం కల్పించారు. వీరికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నివేదికలు సోమవారం వచ్చే అవకాశముంది. ఆ నివేదికల్లో వైరస్‌ సోకలేదని తేలిన వ్యక్తులను వారి ఇంటికి పంపించనున్నారు.


కొవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు ఫిట్‌గా ఉండాలని చైనా ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాంగ్‌జౌ కు చెందిన మారథాన్‌ రన్నర్‌ పాన్‌ షాంచూ తన గదిలోనే 50 కి.మీ.లు పరిగెత్తారు. 4.48 గంటల్లో 6,250 రౌండ్లు పరిగెత్తి ఈ ఫీట్‌ సాధించారు. పరిస్థితి మెరుగుపడగానే నగరంలో 100 కి.మీ. పరిగెడతానని చెప్పారు. 


logo