మంగళవారం 02 జూన్ 2020
National - May 12, 2020 , 15:53:54

సరిహద్దుల వద్ద చైనా హెలికాప్టర్ల హల్‌చల్

సరిహద్దుల వద్ద చైనా హెలికాప్టర్ల హల్‌చల్

హైదరాబాద్: ఉత్తర సిక్కింలో భారత, చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగి పలువురు గాయపడిన ఘటన మరువక ముందే చైనా మరోసారి భారత్‌ను ఉత్కంఠకు గురిచేసే ప్రయత్నాలకు దిగింది. లదఖ్‌లోని వాస్తవాధీన రేఖ సమీపంలో చైన హెలికాప్టర్లు ఎగురుతుండడంతో భారత్ వెంటనే స్పందించింది. ఆ హెలికాప్టర్ల జాడలు రాడార్లు పసిగట్టగానే వాయుసేన విమానాలు రంగంలోకి దిగాయి. సరిహద్దులపై గస్తీచక్కర్లు కొట్టాయి. అయితే చైనా హెలికాప్టర్లు కేవలం సరిహద్దుల వద్దకు మాత్రమే వచ్చాయని, వాస్తవాధీన రేఖ దాటి ఈవలకు రాలేదని నిబంధనల మేరకు పేరు బయటపెట్టేందుకు అంగీకరించని అధికారులు తెలిపారు. చైనా అప్పుడప్పుడు కొన్ని భూభాగాలపై ఆధిపత్యం కోసం హెలికాప్టర్లను పంపి అక్కడ కొన్ని గుర్తులు వదిలిపెట్టడం చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా వాస్తవాధీన రేఖ గుర్తింపు అక్కడక్కడ అస్పష్టంగా ఉండడం వల్ల కూడా చైనా చొచ్చుకురావడం జరుగుతుంది. గతవారం సిక్కింలో జరిగిన ఘర్షణ కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. చైనా నాయకత్వం కరోనా కల్లోల విషయంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న వత్తిడులు ఈ దాడులకు కారణం కావచ్చునని వినిపిస్తున్నది. అటు పాకిస్థాన్ కూడా భారత్‌తో గల తూర్పు సరిహద్దుపై ఎఫ్-16, జెఎఫ్-17 విమానాల గస్తీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా రాత్రిపూట ఈ గస్తీ ఎక్కువగా ఉంటున్నది. హంద్వారాలో జరిగిన ఉగ్రదాడి ప్రతీకారంగా భారత దళాలు ఏదైనా చేస్తాయనే భయంతోనే పాక్ ఇలా గస్తీని పెంచిందని అంటున్నారు.


logo