బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 07:47:30

స‌రిహ‌ద్దులో 40 వేల చైనా సైన్యం

స‌రిహ‌ద్దులో 40 వేల చైనా సైన్యం

  • ఎల్‌ఏసీ వెంబడి మోహరింపు 
  • అప్రమత్తమైన భారత సైన్యం 

న్యూఢిల్లీ : చైనా తన జిత్తులమారితనాన్ని వీడటం లేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తామని చెబుతూనే, మరోవైపు తూర్పు లఢక్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి దాదాపు 40 వేల సైనిక దళాలను మోహరించింది. తద్వారా ఇటీవల జరిగిన సైనిక, దౌత్యపరమైన చర్చల్లో చేసిన వాగ్దానాలకు తూట్లు పొడిచింది. గతవారం జరిగిన ఆఖరి దఫా చర్చల తర్వాత కూడా సరిహద్దుల్లో సైనాన్ని ఉపసంహరించే చర్యలకు ఆ దేశం సిద్ధపడలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్‌ పాయింట్‌ 17ఏ వంటి ప్రాంతాల్లో ఇరువైపులా కేవలం 600 - 800 మీటర్ల దూరంలోనే ఇరుదేశాల సైనికులు ఉన్నట్టు వివరించాయి. చైనా బలగాల మోహరింపు నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సైన్యానికి అవసరమైన సామగ్రి,  రక్షణ వ్యవస్థలను సమకూరుస్తున్నది.

భారత్‌ను చైనా బెదిరించజాలదు: మైక్‌ పాంపియో 

తూర్పు లఢక్‌లో ఉద్రిక్తతలకు తెరతీసిన చైనా.. భారత్‌ తదితర హిమాలయ దేశాలను బెదిరించజాల దని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. మరోవైపు, ఉద్రిక్తతలను శాంతియుతంగా తగ్గించేందుకు చైనా కృషి చేయాలని పేర్కొంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికాలోని ప్రతినిధుల సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. 

ఏ క్షణమైనా సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్‌

ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని వైమానిక దళానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇటీవల సరిహద్దు వెంట తూర్పు లఢక్‌లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వాయుసేన సమర్థంగా పనిచేసిందని, వేగంగా యుద్ధ విమానాలను మోహరించిందని చెప్పారు. గతంలో జరిగిన బాలాకోట్‌ మెరుపుదాడులుగానీ, ఇప్పడు చైనాతో సరిహద్దు వివాదం విషయంలోగానీ వాయుసేన వృత్తి నిబద్ధతను ప్రదర్శించి సమర్థవంతంగా పనిచేసిందని కొనియాడారు. ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కోగలమన్న గట్టి సందేశాన్ని శత్రు దేశాలకు ఐఏఎఫ్‌ పంపిందని మెచ్చుకున్నారు. 



logo