మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 17:40:46

విశ్వాస పరీక్ష నెగ్గిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రభుత్వం

విశ్వాస పరీక్ష నెగ్గిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రభుత్వం

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గింది. సత్యమే విజయం సాధించిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కాగా ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధారివాల్ విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చను ప్రారంభించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్, మణిపూర్, గోవాలోని ప్రభుత్వాలను డబ్బు, అధికారాన్ని ఉపయోగించి కూల్చివేశారని ఆరోపించారు. అయితే రాజస్థాన్‌లో ఇలాంటి ప్రయత్నం విజయవంతం కాలేదని అన్నారు. ఈ సందర్భంగా అక్బర్ గురించి ధారివాల్ ప్రస్తావించారు. మొఘల్ చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తపనతో రాజస్థాన్ మేవార్‌లో ఓటమిని రుచి చూడాల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా, అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు.

మరోవైపు విశ్వాస తీర్మానంపై చర్చసందర్భంగా మాట్లాడిన సీఎం గెహ్లాట్.. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి ఏజెన్సీలు దేశంలో దుర్వినియోగం కావడం లేదా అని ప్రశ్నించారు. మీరు ఫోనులో ఎందుకు సంభాషించారు, మీ పార్టీలో చేరాలని వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించవచ్చుగా అని బీజేపీని నిలదీశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిదేనా అని గెహ్లాట్ ప్రశ్నించారు. విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో 107 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్ర, మిత్రపక్ష పార్టీల సభ్యుల మద్దుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

logo