మంగళవారం 14 జూలై 2020
National - Jun 20, 2020 , 14:12:45

చైనా ఉత్ప‌త్తుల బ‌హిష్క‌ర‌ణ క‌రెక్ట్ కాదు: ‌చిదంబ‌రం

చైనా ఉత్ప‌త్తుల బ‌హిష్క‌ర‌ణ క‌రెక్ట్ కాదు: ‌చిదంబ‌రం

న్యూఢిల్లీ: ఇటీవ‌ల గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య చోటుచేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో దేశంలో చైనా వ్య‌తిరేక నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చైనా జెండాలు, చైనా అధ్య‌క్షుడి ఫ్లైక్సిల‌ను త‌గులబెడుతున్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో చైనా ఉత్ప‌త్తుల‌ను కాల్చివేస్తున్నారు. వివిధ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా చైనా ఉత్ప‌త్తులను బ‌హిష్క‌రించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బ‌తీయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబ‌రం మాత్రం అంద‌రికంటే భిన్నంగా స్పందించారు. చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించ‌డం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాద‌న్నారు. మ‌నం త‌ప్ప‌క స్వ‌యం స‌మృద్ధి సాధించాల‌ని, అదే స‌మ‌యంలో ఇత‌ర ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. భార‌త్ చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించ‌కుండా  గ్లోబ‌ల్ స‌ప్ల‌య్‌ చెయిన్‌లో భాగ‌స్వామిగా కొనసాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. 

చైనా ప్ర‌పంచ వాణిజ్యంతో పోల్చితే ఆ దేశానికి భార‌త్‌తో వాణిజ్యం ఏపాటిద‌ని చిదంబ‌రం ప్ర‌శ్నించారు. కాబ‌ట్టి దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించినంత మాత్రాన ఆ దేశ ఆర్థికవ్య‌వ‌స్థకు క‌లిగే న‌ష్టం పెద్ద‌గా ఏమీ ఉండ‌ద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి చిన్న‌చిన్న అంశాల‌ను లేవ‌నెత్తి స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా దేశభ‌ద్ర‌త లాంటి ఇత‌ర అంశాల గురించి చ‌ర్చ జ‌రుగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చిదంబ‌రం చెప్పారు.           


logo