ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 16:11:10

ప్రారంభానికి సిద్ధమైన చత్తీస్‌గఢ్‌ సదన్‌

ప్రారంభానికి సిద్ధమైన చత్తీస్‌గఢ్‌ సదన్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక భవనాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సేదదీరడంతోపాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఆహారపదార్థాలను పొందే వీలుండేలా ఈ భవనాలు నిర్మించారు. అయితే, చిన్న రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌కు న్యూఢిల్లీలో ప్రత్యేక భవనం అంటూ లేకపోవడంతో ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దేశ రాజధానికి వచ్చినప్పుడల్లా హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. దాంతో న్యూఢిల్లీలో తమకంటూ ప్రత్యేక భవనం నిర్మించుకోవాలని చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నిశ్చయించింది.

న్యూఢిల్లీలోని సెక్టార్‌ -13 ద్వారకలో 43,803 చదరపు గజాల స్థలాన్ని రూ. 22.50 కోట్లకు కొనుగోలు చేసిన చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం.. అక్కడ రూ.60.42 కోట్ల ఖర్చుతో పెద్ద సదన్‌ నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఈ సదన్‌లో 10 సూట్లు, 67 వీఐపీ గదులు, సమావేశ మందిరం, వంట గది, సందర్శకుల నిరీక్షణ హాలు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నాను. ఈసదన్‌లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నారు. గ్రీన్‌ బిల్డంగ్‌ స్టాండర్డ్స్‌ విధానంలో నిర్మిస్తున్న ఈ భవనంలో అతి తక్కువ విద్యుత్‌ ఖర్చులు ఉంటాయట. మధ్యాహ్నం సమయంలో ఒక్క విద్యుత్‌ బల్బు కూడా వేయాల్సిన అవసరం లేకుండా భవనాన్ని నిర్మించేలా ప్లాన్‌ చేస్తున్నారు. అదేవిధంగా బయటిగాలి ధారళంగా వీచేలా వెంటిలేషన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం లోపలి భాగంలో ఉష్ణోగ్రతలను సమతూకం పరిచేందుకు మొక్కల పెంపకానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండనున్నాయి. ఈ సదన్‌ మరో ప్రత్యేకత ఏమిటంటే.. భూ ప్రకంపనలను కూడా తట్టుకొని నిలబడగలదు. చత్తీస్‌గఢ్‌ నిర్మిస్తున్న సదన్‌కు సమీపంలోనే మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన భవనాలు ఉన్నాయి. 

ముంబై, పూరిలో కూడా కడుతాం: సీఎం భూపేష్‌

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో నిర్మిస్తున్న చత్తీస్‌గఢ్‌ సదన్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘెల్‌ చెప్పారు. న్యూఢిల్లీతోపాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై, పూరి నగరాల్లో కూడా చత్తీస్‌గఢ్‌ భవనాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ భవనాలను సాధారణ పౌరులు కూడా వినియోగించుకొనేలా చర్యలు తీసుకొంటామని ఆయన పేర్కొన్నారు.


logo