శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 00:53:57

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌
  • ఓ మావోయిస్ట్‌ హతం.. ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి
  • డిప్యూటీ కమాండెంట్‌సహా ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇరాపల్లి పరిధిలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు, ఇద్దరు జవా న్లు మరణించారు. సీఆర్పీఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌తోపాటు ఆరుగురు జవాన్లు గాయపడ్డారని ఐజీ సుందర్‌రాజ్‌ పీ తెలిపారు. సుక్మ, బీజాపూర్‌ జిల్లాల్లోని మావోయిస్టుల కీలక ప్రాంతాల్లో సుమారు 800 మంది జవాన్లు  గాలింపు చేపట్టారు. జవాన్లను ఇరాపల్లికి సమీపాన చెరపల్లి అడవిలోని మావోయిస్టులు గమనించి కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపారు.


ఇరుపక్షాల మధ్య 90 నిమిషాల సేపు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కోబ్రా బెటాలియన్‌ డిప్యూటీ కమాండెంట్‌ సహా ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి జవాన్ల దాటికి తాళలేక మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. కాల్పులు నిలిచిపోయా క ఆ ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్‌ జవాన్లు తమ ఆధీనంలోకి తీసుకుని గాలించి, ఓ మావోయిస్టు మృతదేహంతోపాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. కాగా సుక్మ జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ 150వ బెటాలియన్‌ జవాన్లు గాలింపు జరుపగా మినప ఇలాకలోని చింతల్‌నార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు రోడ్డు వద్ద పాతిన ఐదు కిలోల ఐఈడీ బాంబును వెలికి తీసి నిర్వీర్యం చేసినట్టు సుక్మ ఎస్పీ శలభ్‌ సిన్హా తెలిపారు. 


logo