సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:42:47

అదిగో ప్రజ్ఞ రోవర్‌

అదిగో ప్రజ్ఞ రోవర్‌

  • చంద్రుడిపై చంద్రయాన్‌- 2రోవర్‌ను గుర్తించిన షణ్ముగ సుబ్రమణియన్‌
  • చందమామ దక్షిణ ధ్రువంలో చెక్కుచెదరని రోవర్‌
  • గతంలోనే ల్యాండర్‌ గుర్తించిన ఈ యువ ఇంజినీర్‌
  • షణ్ముగ పరిశోధనను పరిశీలిస్తున్నాం: ఇస్రో

న్యూఢిల్లీ, ఆగస్టు 2: చంద్రుడిపై కూలిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ను స్వయంగా గుర్తించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన చెన్నైకి చెందిన యువ ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ తాజాగా మరో ఘనత సాధించారు. చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి పంపిన ప్రజ్ఞ రోవర్‌ను కూడా గుర్తించినట్టు ఆయన ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని మెయిల్‌ ద్వారా అంతరిక్ష ప్రయోగసంస్థ (ఇస్రో)కు కూడా తెలిపినట్టు వెల్లడించారు. షణ్ముగ ప్రకటనపై ఇస్రో చైర్మన్‌ కే. శివన్‌ స్పందించారు. ఆయన తమకు పంపిన చిత్రాలను ఇస్రో నిపుణులు పరిశీలిస్తున్నారని ట్వీట్‌ చేశారు. 

చంద్రయాన్‌-2 క్రాష్‌ ల్యాండింగ్‌

చంద్రుడిపై ప్రయోగాల కోసం ఇస్రో గతేడాది జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌-2 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్‌-2 మిషన్‌లో విక్రమ్‌ ల్యాండర్‌ను, ప్రజ్ఞ రోవర్‌ను పంపింది.  2019 ఆగస్టు 20న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుండగా విక్రమ్‌ ల్యాండర్‌ అదుపుతప్పి చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. భూమితో సంబంధాలు తెగిపోయిన దానిని చాలారోజులు వెదికినా ఇస్రో కనిపెట్టలేకపోయింది. కానీ, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సాయంతో షణ్ముగ సుబ్రమణియన్‌ విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తాజాగా ల్యాండర్‌లోని ప్రజ్ఞ రోవర్‌ను కూడా గుర్తించారు. ఇంతటి ఘనత సాధించిన ఆయన స్పేస్‌ ఇంజినీర్‌ కాకపోవటం గమనార్హం. వ్యక్తిగత ఆసక్తితోనే ఈ ఘనత సాధించారు. 

ల్యాండర్‌కు దూరంగా రోవర్‌

చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ కూలిన ప్రదేశంనుంచి కొన్ని మీటర్ల దూరంలో రోవర్‌ ఉన్నట్టు షణ్ముగ తెలిపారు. రోవర్‌ చెక్కుచెదరకుండా ఉందని, భూమినుంచి ఆదేశాలు అందిస్తే స్పందించే అవకాశం కూడా ఉందని చెప్పారు. అయితే, అది తిరిగి భూమికి సందేశాలు పంపే అవకాశం లేకపోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే తమ వ్యోమ నౌకలను చంద్రుడిపై విజయవంతంగా దింపగలిగాయి.


logo