గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 15:58:57

కొవిడ్ ఒత్తిడి తట్టుకోలేక.. వైద్యుడి ఆత్మహత్య

కొవిడ్ ఒత్తిడి తట్టుకోలేక.. వైద్యుడి ఆత్మహత్య

చెన్నై: కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. మహమ్మారితో పోరాడుతున్న వీరు శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నారు. తమిళనాడులోని ఓ యువ వైద్యుడు ఒత్తిడిని భరించలేక హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 24 ఏండ్ల కన్నన్‌గా గుర్తించారు.

తిరుప్పూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన కన్నన్‌ ప్రస్తుతం ఆర్థోపెడిక్స్లో స్పెషలైజేషన్ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నాడు. తంజావూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత జూన్లో ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీలో చేరారు. అతను కొవిడ్‌-19 రోగులకు చికిత్స చేయడంలో గత కొన్నిరోజులుగా పాల్గొంటున్నాడు.  "పని ఒత్తిడి కారణంగా" ఆత్మహత్య చేసుకున్నట్లు దవాఖాన వైద్యుల వాట్సాప్ గ్రూపులో మృతుడు మెసేజ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు.

సోమవారం తెల్లవారుజామున 1:30 వరకు విధులకు హాజరైన కన్నన్‌.. అనంతరం హాస్టల్‌లోని తన గదికి వెళ్ళాడు. ఉదయం 4 గంటల సమయంలో కొంతమంది వైద్యులు అతడు దవాఖాన సమీపంలో నేలమీద పడుకున్నట్లు గుర్తించారు. వైద్యులు వెంటనే ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఒక బృందం సంఘటన స్థలానికి చేరుకుని చూసేసరికి చనిపోయి ఉన్నాడు.

కన్నన్‌ గది హాస్టల్‌లోని మూడో అంతస్తులో ఉంది. అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు పంపారు. 


logo