శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 18:18:34

కరోనాకు చెక్‌ పెడతానని.. కన్నుమూశాడు

కరోనాకు చెక్‌ పెడతానని.. కన్నుమూశాడు

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికి పెరుగుతుండటంతో విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే పనిలో అన్ని ప్రముఖ సంస్థలు మునిగిపోయాయి. చైనా, అమెరికా, భారత్‌  సహా అనేక దేశాలు కొవిడ్‌-19కు వ్యాక్సిన్లను తయారుచేసేందుకు పరిశోధన దశలు పూర్తిచేసుకొని క్రినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకొన్నాయి. ఈ నేపథ్యంలో తాను తయారుచేసిన ఔషధం కరోనాకు చెక్‌ పెడుతుందని భావించిన ఒకరు.. ముందుగా తనపైనే పరీక్షించుకోవాలని ఆ ఔషధాన్ని తీసుకొని మృత్యువాతపడ్డాడు. మృతుడు ఆయుర్వేద, హెర్బల్‌ ఔషధాలు తయారుచేసే చెన్నైలోని సుజాతా బయోటెక్‌ ఫార్మసీ కంపెనీ ఉద్యోగి కే శివనేసన్‌ (47) గా గుర్తించారు. ఈయన ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన ఉత్తరాఖండ్‌లోని కాశీపుర ప్లాంట్‌లో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 


శివనేసన్‌ వివిధ మందుల సూత్రాలను రూపొందిస్తూ సదరు కంపెనీ ఎండీ కూడా అయిన డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు చూపేవాడు. ఈ నేపథ్యంలో శివనేసన్‌ తయారుచేసిన మందును గురువారం రాత్రి ఇద్దరు కలిసి సేవించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఇద్దరిని టీ నగర్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివనేసన్‌ కన్నుమూశారు. డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రక్తంలోని ప్లేట్‌లెట్‌ కణాల సంఖ్య పెంచేందుకు ఈ మందు ఉపయోగపడుతుందని భావించి ఉంటారని పోలీసులు తెలిపారు.


logo