బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 08:39:25

విశాఖ ఉక్కిరిబిక్కిరి.. పశువులు మృత్యువాత.. మాడిన చెట్లు

విశాఖ ఉక్కిరిబిక్కిరి.. పశువులు మృత్యువాత.. మాడిన చెట్లు

అమరావతి : విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైన విషయం విదితమే. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ రసాయన వాయువు లీక్‌ కావడంతో విశాఖ పట్టణం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రసాయన వాయువు ప్రభావంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వందల సంఖ్యలో బాధితులను పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయువు ప్రభావంతో మనషులే కాదు.. మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ఆవులు, దూడలు విగతజీవులుగా పడిపోయాయి. అక్కడున్న చెట్లు మాడిపోయాయి. 

రసాయన వాయువు లీక్‌ అయిందన్న విషయం తెలుసుకున్న ఆర్‌.ఆర్‌. వెంకటాపురం గ్రామస్తులు ఇండ్లలోనే ఉండిపోయారు. అక్కడ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇండ్లలోనే చిక్కుకున్న వారి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాయువు ప్రభావంతో గంగరాజు అనే వ్యక్తికి కళ్లు కనబడకపోవడంతో.. బావిలో పడి చనిపోయాడు. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు.


logo