శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 06:33:56

విశాఖలో రసాయన వాయువు లీక్‌.. 10 మంది మృతి

విశాఖలో రసాయన వాయువు లీక్‌.. 10 మంది మృతి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. 

10 మంది మృతి.. మృతుల్లో ఇద్దరు వృద్ధులు

దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 10 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనాస్థలికి పదుల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి వేరే ప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు. 


logo