మంగళవారం 19 జనవరి 2021
National - Jan 12, 2021 , 18:13:48

ఆ విద్యార్థి కోసం బస్‌ టైమింగ్‌నే మార్చారు!

 ఆ విద్యార్థి కోసం బస్‌ టైమింగ్‌నే మార్చారు!

ఉదయాన్నే స్కూల్‌ బస్సు రాకుండా ఉంటే బాగుండు.. బస్సు డ్రైవర్‌కు జ్వరం రావాలనో.. బస్సు టైరు పంక్చర్‌ కావాలనో కోరుకునే విద్యార్థులు చాలా మంది ఉంటారు. స్కూల్‌కు డుమ్మా కొట్టేందుకు చాలా మంది చిన్నారులు కారణాలు వెతుక్కుంటుంటారు. ఇలాంటి అనుభవం ప్రతీ ఒక్కరికి ఉంటుంది. 

అయితే, ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి మాత్రం తన చదువుల కోసం పెద్ద మార్పునే తీసుకొచ్చాడు. నిత్యం తాను వెళ్లే బస్సు ఆలస్యంగా రావడం వల్ల తాను సమయానికి స్కూల్‌కు వెళ్లలేకపోతున్నానని, బస్సు సమయాన్ని మార్చి నిజానికి బయల్దేరే సమయం కన్నా పది నిమిషాల ముందు వచ్చేలా చేయండి అంటూ ఆ భువనేశ్వర్‌ ఎంబీఎస్‌ స్కూల్లో చదువుతున్న సాయి అన్వేష్‌ ప్రధాన్‌ అనే విద్యార్థి.. కాపిటల్‌ రీజియన్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోన్ట్‌ ఎండీగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అరుణ్‌ బోత్రాకు లేఖ రాశాడు. సాయి లేఖను గమనించిన అరుణ్‌ బోత్రా.. వెంటనే బస్సు సమయాన్ని పది నిమిషాల ముందుకు మార్చి సాయి అన్వేష్ స్కూల్‌కు బయల్దేరే సమయానికి వచ్చేలా సమయాలను మార్చారు. అంతే సాయి అన్వేష్‌ నిత్యం వెళ్లే 7.30 గంటల సమయానికి బస్సు రానే వచ్చింది. దాంతో సాయి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇక ముందు కరెక్ట్‌ టైంకు స్కూల్‌కు చేరుకోవచ్చునని, ఇందుకు సీఆర్‌యూటీ ఎండీ అరుణ్‌ బోత్రాకు ధన్యవాదాలు అని ట్విట్టర్‌లో రాశాడు.

సాయి అన్వేష్‌ ప్రధాన్‌ ట్వీట్‌పై నెటిజెన్లు రకరకాల స్పందిస్తున్నారు. చదువుల పట్ల విద్యార్థి అంకితభావానికి సీఆర్‌యూటీ సహకారం.. హ్యాట్సాఫ్‌ అని కొందరు.. ఇలాంటి విద్యార్థులు ఇంకా ఉన్నారా? అంటూ మరికొందరు కామెంట్స్‌ చేశారు. పాఠశాల విద్యార్థికి సహాయపడటానికి బస్సు సమయాలను మార్చాలనే నిర్ణయం తీసుకున్న రవాణా శాఖకు ట్విట్టర్‌లో చాలా ప్రశంసలు, ప్రశంసలు లభించాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.