e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జాతీయం మూడో ముప్పు లేనట్టే!

మూడో ముప్పు లేనట్టే!

  • కరోనా థర్డ్‌వేవ్‌ ప్రమాదాన్ని తోసిపుచ్చుతున్న వైద్యనిపుణులు
  • తీవ్రమైన కొత్త స్ట్రెయిన్‌తోనే మూడోవేవ్‌కు అవకాశం
  • ఇప్పటివరకూ అలాంటి వేరియంట్‌ జాడ లేదు
  • మూడోవేవ్‌ రాకకు శాస్త్రీయ ఆధారాల్లేవంటున్న శాస్త్రవేత్తలు
  • వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ నియమాలు పాటిస్తే మంచిదని వెల్లడి

‘మరికొద్ది రోజుల్లో థర్డ్‌వేవ్‌ రానున్నది. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనున్నది’ అంటూ సోషల్‌మీడియాలో గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారంతో ఆందోళనపడుతున్న ప్రజలకు వైద్యనిపుణులు చేస్తున్న తాజా ప్రకటనలు ఊరట కలిగిస్తున్నాయి. దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రమాదం తప్పే అవకాశాలు ఎక్కువవుతున్నట్టు వారు పేర్కొంటున్నారు. ఈ వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను కూడా చూపిస్తున్నారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 16: ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ దశ మొదలవ్వాలంటే ఇప్పుడున్న వైరస్‌ వేరియంట్లు కాకుండా, బలమైన కొత్త స్ట్రెయిన్‌ విశృంఖలంగా వ్యాప్తి చెందాలని.. అప్పుడే మూడో ఉద్ధృతికి అవకాశాలుంటాయని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. డెల్టా వేరియంట్‌ తర్వాత ఆ స్థాయి తీవ్రత గల స్ట్రెయిన్‌ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదన్నారు. దీంతో ఒకవిధంగా థర్డ్‌వేవ్‌ ముప్పు లేనట్టేనని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళలో కేసుల పెరుగుదలపై స్పందిస్తూ.. అది ఆ రాష్ర్టానికే పరిమితమైన విషయాన్ని గుర్తుచేశారు. కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ సరళిని కచ్చితత్వంతో అంచనా వేసిన ‘సూత్రా మోడల్‌’ తయారీ బృందంలో అగర్వాల్‌ ఒకరు.

శాస్త్రీయ ఆధారాల్లేవు.

- Advertisement -

అక్టోబర్‌ మధ్యనాటికి కరోనా థర్డ్‌వేవ్‌ విరుచుకుపడుతుందన్న అంచనాలను తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాసరావు కొట్టిపారేశారు. ఈ వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ప్రమాదకరమైన కొత్త స్ట్రెయిన్‌ వస్తేనే థర్డ్‌వేవ్‌ ప్రమాదం ఉంటుందని, ప్రస్తుతానికి అలాంటి వేరియంట్ల జాడలేదన్నారు. ఇంకోవైపు, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్‌గా మారడానికి ఆరు నెలల సమయం పడుతుందని, అయితే ఆ కొత్త స్ట్రెయిన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటేనే థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉండొచ్చని సీసీఎంబీ అంతర్గత సమావేశంలో అభిప్రాయపడింది. అయితే, అప్పటికే అందరూ వ్యాక్సిన్‌ వేసుకుంటారని, దీంతో మూడోవేవ్‌ ముప్పు లేనట్టేనని సంబంధిత వర్గాలు
తెలిపాయి. ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే కూడా దాదాపుగా ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.

ఒక్క వేరియంట్‌తో సాధ్యంకాదు

వచ్చే ఆరు నెలల్లో కొవిడ్‌-19 ఎండెమిక్‌ (కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధి) దశకు చేరుకొంటుందని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ అన్నారు. ఒక వేళ కొత్త వేరియంట్‌ వచ్చినా.. అదొక్కటే మూడో వేవ్‌ను తీసుకురాలేదని పేర్కొన్నారు. మరోవైపు, కొవిడ్‌-19 భారత్‌లో ఎండెమిక్‌ దశకు మారుతున్నట్లు కనిపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ కూడా ఇటీవలే వెల్లడించారు. వచ్చే ఏడాది చివరినాటికి.. దేశంలో 70% వ్యాక్సినేషన్‌ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం, కొవిడ్‌-19 నిబంధనలను పాటించడంతో థర్డ్‌వేవ్‌ ముప్పును తరిమివేయచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బూస్టర్‌ డోసు ప్రతిపాదనేదీ లేదు

పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి రెండు డోసుల టీకా వేయడమే తమ ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. బూస్టర్‌ డోసు వేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పేర్కన్నారు. దేశంలో 20% మంది రెండు డోసుల టీకా వేసుకొన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. 62% మంది ఒక్కడోసు వేసుకొన్నట్టు వెల్లడించారు.

టెలిగ్రామ్‌లో ఫేక్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు!

ఇండియా సహా 29 దేశాల్లో టెలిగ్రామ్‌ ద్వారా నకిలీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు, కరోనా టెస్టు ఫలితాలను అమ్ముతున్నారని చెక్‌ పాయింట్‌ రిసెర్చ్‌(సీపీఆర్‌) వెల్లడించింది. ఇండియాలో నకిలీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌కు రూ.5,520 వసూలు చేస్తున్నట్టు తెలిపింది. ఫేక్‌ సర్టిఫికెట్లపై సీపీఆర్‌ గురువారం నివేదిక విడుదల చేసింది. మార్చి నుంచే ఈ దందా మొదలైనట్టు అందులో పేర్కొన్నది. దాదాపు 5వేల టెలిగ్రామ్‌ గ్రూపుల్లో నకిలీ డాక్యుమెంట్లను గుర్తించినట్టు తెలిపింది.

పండుగల వేళ కరోనాతో జాగ్రత్త: కేంద్రం

రానున్న రెండు, మూడు నెలలు పండుగల సీజన్‌ కావడంతో ప్రజలు గుమికూడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ క్రమంలో కరోనా వైరస్‌ కూడా వేగంగా వ్యాప్తిచెందే అవకాశముంటుందని కేంద్రం హెచ్చరించింది. కాబట్టి ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని సూచించింది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని కోరింది. పండుగల సమయంలో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జరుపుకోవాలని సూచించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement