రైతన్నపై విరిగిన లాఠీ

- రెండోరోజూ కొనసాగిన ‘చలో ఢిల్లీ’ నిరసనలు
- పోలీసుల లాఠీచార్జీ,
- బాష్పవాయు ప్రయోగం
- అన్నదాతలకు గాయాలు
- వెనుకడుగు వేయని రైతులు
- దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం
- బురారీ మైదానంలో నిరసనలకు అనుమతి
- రైతులతో చర్చలకు సిద్ధమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్
న్యూఢిల్లీ, నవంబర్ 27: న్యాయ పోరాటం ముందు బల ప్రయోగం మోకరిల్లింది. దేశ రాజధాని ఢిల్లీలోకి అన్నదాతలను ఎట్టిపరిస్థితుల్లో రానివ్వబోమన్న మోదీ సర్కార్.. రైతుల ఆగ్రహజ్వాలకు తలవంచింది. బారికేడ్లు, జల ఫిరంగులు, బాష్ప వాయు గోళాలు, ముళ్ల కంచెలు ఇవేమీ రైతన్న అడుగును అడ్డుకోలేకపోయాయి. వెన్నుచూపని రైతన్నను చూసి వణికిపోయిన కేంద్రం ఇక చేసేదేమీ లేక ఢిల్లీలోకి రైతులు అడుగుపెట్టడానికి అనుమతించింది. అయితే పోలీసుల పహారాలోనే వారంతా నగరంలోకి రావాలని సూచించింది.
విరిగిన లాఠీలు..
మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ నిరసన ర్యాలీ రెండో రోజు కూడా ఉద్రిక్తతల నడుమే కొనసాగింది. వేలాది మంది రైతులను అడ్డుకోవడం పోలీసులకు సాధ్యంకాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఉత్తర ఢిల్లీలో బురారీ ప్రాంతంలోని నిరంకారీ మైదానంలో శాంతియుత నిరసనలు చేపట్టేందుకు అనుమతినిచ్చింది. అయితే పోలీసుల పహారాలోనే రైతులు నగరంలోకి రావాలని సూచించింది. దీంతో రైతులు మైదానం వైపునకు అడుగులు వేశారు. కాగా తాము ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిరసన తెలుపడానికి అనుమతిని కోరామని, పోలీసులు ఆ విజ్ఞప్తిని తిరస్కరించారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. అంతకుముందు.. శుక్రవారం ఉదయానికి రాజధాని ఢిల్లీ సరిహద్దులోని పలు ప్రాంతాలకు పెద్దఎత్తున అన్నదాతలు చేరుకున్నారు. అయితే, అప్పటికే సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఇసుకతో నింపిన లారీలను, బారికేడ్లను, ముళ్ల కంచెలను అడ్డుగా పెట్టారు. అయినప్పటికీ, వాటిని దాటుకుంటూ రైతులు ముందుకు కదిలారు. దీంతో వారిపై పోలీసులు బాష్పవాయుగోళాలు, జల ఫిరంగులను ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్ట్టేందుకు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనల్లో పలువురు రైతులకు గాయాలయ్యాయి. సింఘు, సోనిపట్, పానిపట్ తదితర ప్రాంతాల్లో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ సంగ్రామ క్షేత్రాలను తలపించాయి. టిగ్రీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డంగా నిలిపిన లారీలను పక్కకు జరిపేందుకు రైతులు ట్రాక్టర్లను ఉపయోగించారు.
చర్చలకు సిద్ధం: కేంద్రం
రైతులతో అన్ని విషయాలపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. మరోవైపు శాంతియుత నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉన్నదని పంజాబ్ సీఎం అమరీందర్ అన్నారు.
ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతులపై లాఠీచార్జీకి నిరసనగా అఖిలభారత రైతుపోరాట సమన్వయకమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనంచేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... రైతు వ్యతిరేక వ్యవసాయచట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో వెంకట్రామయ్య, పశ్య పద్మ, టీ సాగర్, జమున, రామకృష్ణారెడ్డి, అరుణ పాల్గొన్నారు.
టిక్రీ సరిహద్దుల ద్వారా నగరంలోకి..
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలో బురారీ ప్రాంతంలోని నిరంకారీ మైదానంలో శాంతియుత నిరసనలు చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతినివ్వడంతో వేలాది మంది రైతులు టిక్రీ సరిహద్దుల నుంచి మైదానానికి చేరుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలైన ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతున్నది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య రైతులు నడక సాగిస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది రైతులు మైదానానికి చేరుకున్నారు. మరోవైపు, సింఘు సరిహద్దుల్లో ఉన్న రైతులను నగరంలోకి పోలీసులు ఇంకా అనుమతించలేదు.
తాత్కాలిక జైళ్లుగా స్టేడియాలు.. కుదరదన్న కేజ్రీవాల్ సర్కార్
న్యూఢిల్లీ: రైతులు చేపడుతున్న నిరసనలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కార్ ప్రకటించింది. రైతులకు నష్టం కలిగించే చీకటి చట్టాలను (వ్యవసాయ చట్టాలను) కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరోవైపు, అరెస్టు చేసిన రైతుల కోసం ఢిల్లీలోని తొమ్మిది స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని ఢిల్లీ పోలీసులు ఆప్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. దీన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం నిరాకరించింది.
నిరసనల్ని అణగదొక్కితే.. ఉవ్వెత్తున లేస్తాయి!
డెహ్రాడూన్: ‘చలో ఢిల్లీ’ నిరసన ర్యాలీని బీజేపీ పాలిత రాష్ర్టాలు అడ్డుకోవడంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త రాకేశ్ కుమార్ సింగ్ మండిపడ్డారు. శాంతియుత నిరసనలను అణగదొక్కాలని ప్రయత్నిస్తే, ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయన్నారు. రైతులపై హర్యానా పోలీసులు బాష్పవాయుగోళాలు, జలఫిరంగులు ప్రయోగించడాన్ని ఖండించారు. రైతుల ప్రయోజనాల కోసమే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొని వస్తే, రైతులతో భేటీ కాకుండా ప్రధాని ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
- ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: సీతమ్మకు స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..
- పోరాడిన కెప్టెన్ జో రూట్