కోవిడ్ టీకా అభివృద్ధి కోసం బీఈతో సీఈపీఐ భాగస్వామ్యం

హైదరాబాద్: కోవిడ్19 టీకా అభివృద్ధి కోసం నగరానికి చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ.. కొయలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్(సీఈపీఐ)తో ఒప్పందం కుదుర్చుకున్నది. కోవిడ్ టీకా అభివృద్ధి, ఉత్పత్తి కోసం ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. టీకా ఉత్పత్తిని పెంచేందుకు బీఈ సంస్థ కోసం.. సుమారు 5 మిలియన్ల డాలర్లను సీఈపీఐ ఇవ్వనున్నది. 2021లో సుమారు వంది మిలియన్ల టీకా డోసుల వరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అదనంగా మరిన్ని నిధులను సీఈపీఐ కేటాయించనున్నది. ఈ ఏడాది నవంబర్‌లో బీఈ సంస్థ.. ఒకటి, రెండవ దశ టీకా ట్రయల్స్‌ను భారత్‌లో మొదలుపెట్టింది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో ఆ టీకా ట్రయల్స్‌కు సంబంధించిన మధ్యంతర డేటా అందుబాటులోకి రానున్నది. కోవిడ్19 వ్యాక్సిన్ గ్లోబల్ యాక్సెస్ (కోవాక్స్) విధానం కోసం ఈ సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. అన్ని దేశాలకు కోవిడ్ టీకా అందించాలన్న ఉద్దేశంతో కోవాక్స్ను ఏర్పాటు చేశారు.
ప్రోటీన్ యాంటిజెన్ నుంచి బయోలాజికల్ సంస్థ.. కోవిడ్ టీకాను తయారు చేస్తున్నది. స్థానిక వాతావరణానికి తట్టుకునే విధంగా వ్యాక్సిన్ రూపకల్పన జరుగుతున్నది. టీకా అభివృద్ధి, ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని, వ్యాక్సిన్ ఎంత సురక్షితంగా ఉంది, ఎంత సమర్థవంతంగా ఉందన్న అంశం కీలకమైందని, ప్రతి ఒక్కరికీ టీకా అందాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతున్నట్లు సీఈపీఐ సంస్థ సీఈవో డాక్టర్ రిచర్డ్ హాట్చట్ తెలిపారు. సీఈపీఐతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ ఒప్పందంతో బయో సంస్థ వినియోగిస్తున్న వ్యాక్సిన్ టెక్నాలజీకి గుర్తింపు దక్కినట్లే అని బయోలాజికల్ ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ మహిమ ధాట్ల తెలిపారు. గత 10 నెలల నుంచి అసాధారణ రీతిలో హెల్త్ ఎమర్జెన్సీ ఉందని, ప్రజలంతా కోవిడ్19 టీకా కోసం ఎదురుచూస్తున్నారని, సురక్షితమైన-ప్రభావంతమైన టీకాను తయారు చేసేందుకు నిరంతరం పని చేస్తున్నామని మహిమ పేర్కొన్నారు.