ఆ నాలుగు రాష్ర్టాలకు కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత దృష్ట్యా కేంద్రం మహారాష్ర్ట, కేరళ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలను హెచ్చరించింది. ఈ నాలుగు రాష్ర్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని కేంద్రం పేర్కొంది. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆ నాలుగు రాష్ర్టాలను కేంద్రం ఆదేశించింది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో.. ఈ నాలుగు రాష్ర్టాల నుంచే 59 శాతం కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. లేని యెడల కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉందని చెప్పింది.
మహారాష్ర్టలో ప్రస్తుతం 52 వేల కేసులు యాక్టివ్గా ఉన్నాయని, మరో 50 వేల మంది చనిపోయారని కేంద్రం పేర్కొంది. ఛత్తీస్గఢ్, బెంగాల్లో సుమారు 9 వేల కేసుల చొప్పున యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. బెంగాల్లో పది వేల మంది మరణించగా, ఛత్తీస్గఢ్లో 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల నుంచి కేరళలో సగటున రోజుకు 5 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే కాలంలో మహారాష్ర్టలో 3,700 కేసులు, ఛత్తీస్గడ్లో 1,006, బెంగాల్లో 908 కేసులు నమోదవుతున్నాయి.
ఇక కొత్త రకం కరోనా కేసులు 70 నమోదు అయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2.29 లక్షలకు చేరింది. 1.5 లక్షల మంది కరోనాతో చనిపోయారు. దేశంలో తొలి దశలో 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం పేర్కొంది.