గురువారం 02 జూలై 2020
National - Jun 23, 2020 , 16:13:57

పీఓకేను కలుపుకోవడమే కేంద్రం ప్రధాన అజెండా: మంత్రి జితేంద్రసింగ్‌

పీఓకేను కలుపుకోవడమే కేంద్రం ప్రధాన అజెండా: మంత్రి జితేంద్రసింగ్‌

న్యూ ఢిల్లీ: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను ఇండియాలో కలుపుకోవడమే కేంద్ర సర్కారు ప్రధాన అజెండా అని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ స్పష్టం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల వెంట ఉన్న సరిహద్దు వివాదాల పరిష్కారంతోపాటు పీఓకే, లఢఖ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనమెవరూ ఊహించలేం. అయితే, పీఓకేను ఇండియాలో కలుపుకొని, మహారాజా హరిసింగ్‌ మన దేశానికి ఇచ్చిన ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించడమే మా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మంగళవారం నిర్వహించిన జమ్మూ కశ్మీర్‌ జనసంవాద్‌ వర్చువల్‌ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా, ఈ ర్యాలీలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ కూడా మాట్లాడారు. దేశానికి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చేసిన సేవలకు గుర్తుగానే జమ్ము కశ్మీర్‌లోని ఛెనానీ-నశ్రీ టన్నెల్‌కు ఆయన పేరు పెట్టినట్లు గుర్తుచేశారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి తగిన గౌరవం ఇవ్వలేదని, కానీ బీజేపీ పార్టీ జాతీయస్థాయి రహదారికి ఆయన పేరుపెట్టింది అని వ్యాఖ్యానించారు. అలాగే, జమ్ము కశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత్‌లో కలుపుకునేందుకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. logo