బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 01:52:58

ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తెచ్చి రాష్ర్టాలను ఆదుకోవాలి కేంద్రానికి శివసేన హితవు

ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తెచ్చి రాష్ర్టాలను ఆదుకోవాలి కేంద్రానికి శివసేన హితవు

ముంబై: కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్న రాష్ర్టాలను ఆదుకోవాలని, ఇందుకోసం అవసరమైతే ప్రపంచ బ్యాంకు వద్ద రుణం తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి శివసేన సూచించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ర్టాలకు కేంద్రం అండగా నిలువాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో సంపాదకీయం వెలువడింది. ‘గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌ రాష్ట్రప్రభుత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీలో తమకు రావాల్సిన వాటా రూ.23 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వకపోగా.. కరోనాపై పోరుకు అవసరమైన వైద్య పరికరాల సరఫరాను నిలిపివేయడంతో మహారాష్ట్ర ఖజానాపై రూ.300 కోట్ల భారం పడింది. కేంద్ర ఖజానాలో 22 శాతం ఆదాయం ముంబై నుంచి వస్తున్నది. కానీ మహారాష్ట్రకు సాయం చేయటానికి కేంద్రం ముందుకు రావటం లేదు. అంతేకాదు.. ఇతర రాష్ర్టాల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరిస్తున్నది. కరోనాతో మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ రాష్ర్టాలు ఇబ్బందుల్లో పడ్డాయి. రూ.14.4 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకున్నాయి’ అని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు. 

20 లక్షల ప్యాకేజీ ఏది?

లాక్‌డౌన్‌ వేళ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని, కానీ, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో రహస్యంగా మారిందని శివసేన ఎద్దేవా చేసింది. పెద్దనోట్ల రద్దు, ముందస్తు జాగ్రత్తలు లేకుండానే విధించిన లాక్‌డౌనే ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఆరోపించింది.


logo