ఆదివారం 12 జూలై 2020
National - Jun 30, 2020 , 01:26:29

జూలై 31 వరకూ బడులు బంద్‌

జూలై 31 వరకూ బడులు బంద్‌

 • అన్‌లాక్‌-2కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు 
 • కోచింగ్‌ సెంటర్లు, శిక్షణ సంస్థలు కూడా 
 • కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ యథాతథం
 • దేశమంతా రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు
 • అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలిచ్చిన కేంద్రం
 • రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. బడులు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు జూలై 31 దాకా తెరువకూడదని ఆదేశించింది. సోమవారం కేంద్ర హోంశాఖ అన్‌లాక్‌-2 విధివిధానాలను ప్రకటించింది. ఈ నిబంధనలు జూలై 1 (బుధవారం) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్‌లాక్‌ 1.0 గడువు ఈ నెలతో ముగియనున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌, దూరవిద్యా కోర్సులు కొనసాగుతాయని హోం శాఖ వెల్లడించింది. మెట్రో రైళ్లు, జిమ్ములు, థియేటర్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉన్నప్పటికీ, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి హోంశాఖ అనుమతి మేరకు కొన్ని సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై ఎప్పటిలాగే నిషేధం ఉంటుందని పేర్కొన్నది. దేశీయ విమానాలు, ప్యాసింజర్‌ రైళ్లను దశల వారీగా పూర్తి స్థాయిలో పునరిద్ధరిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొన్నది. ఇంటి నుంచి బయటకు వస్తే కచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని నొక్కి చెప్పింది. కోచింగ్‌ సెంటర్లు, శిక్షణ సంస్థలపై జూలై 31దాకా నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలకు వెసులుబాట్లను ఇచ్చింది. సిబ్బంది వ్యవహారాల శాఖ(డీవోపీటీ) అనుమతుల మేరకు వీటిని తెరువవచ్చని తెలిపింది. ఉద్యోగులు సాధ్యమైనంత మేరకు వర్క్‌ఫ్రమ్‌ హోం చేయాలని కోరింది. బహిరంగప్రదేశాల్లో పాన్‌, పొగాకు, గుట్కా నమలడాన్ని పూర్తిగా నిషేధించింది.  

అన్‌లాక్‌ 2.0 విధివిధానాలు:

 • అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవు. 
 • కంటైన్మెంట్‌ జోన్లలో నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తారు. 
 • రాష్ర్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు కంటైన్మెంట్‌ జోన్లతో పాటు కేసుల సంఖ్యను బట్టి బఫర్‌ జోన్లను ప్రకటించవచ్చు. అక్కడ కూడా కట్టడి చర్యలు తీసుకోవచ్చు.
 • వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
 • ఉద్యోగులు, స్మార్ట్‌ ఫోన్లు ఉన్నవారు ఆరోగ్య సేతు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 
 • వివాహ సంబంధ కార్యక్రమాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి.
 • నిబంధనల ప్రకారం దుకాణదారులు ఏర్పాట్లు చేసుకోవాలి.
 • కేంద్రం, రాష్ర్టాల విధివిధానాలు అన్ని సంస్థలు, కంపెనీలు పాటించాలి.


logo