ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Jul 14, 2020 , 20:21:58

బ్రహ్మపుత్ర నది కింద సొరంగం కోసం కేంద్రం సూత్ర‌ప్రాయ అనుమ‌తి

బ్రహ్మపుత్ర నది కింద సొరంగం కోసం కేంద్రం సూత్ర‌ప్రాయ అనుమ‌తి

ఢిల్లీ : బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వ‌రుస‌ల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమాలింగ‌ర్ ప‌ట్ట‌ణాల‌ను క‌లుపుతుంది. న‌ది అడుగుభాగంలో ట‌న్నెల్ ను నిర్మించ‌డం భార‌త్‌కు ఇదే తొలిసారి. ఈ సొరంగమార్గం చైనా స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైహు సరస్సు క్రింద చైనా నిర్మిస్తున్న అండర్ వాటర్ టన్నెల్ కంటే ఇది ఎక్కువ పొడవైన‌దిగా స‌మాచారం. 

ప్రతిపాదిత సొరంగం భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. దీని ద్వారా అసోం,  అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఏడాది పొడవునా కనెక్టివిటీని అందుబాటులోకి వ‌స్తుంది.  సైనిక సామాగ్రి, మందుగుండు సామగ్రిని రవాణా చేయడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ సొరంగ మార్గంలో వాహనాలు 80 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించే వీలుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అమెరికా లూయిస్ బెర్గర్ కంపెనీ భాగ‌స్వామ్యంలో రూపొందిన ఈ ప్రాజెక్టు నివేదిక‌కు కేంద్ర ప్రభుత్వం  మార్చిలో ఆమోదం తెలిపిన‌ట్లుగా స‌మాచారం. 14.85 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మాణం డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని ఎన్‌హెచ్‌ఐఐడిసిఎల్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనిని మూడు దశల్లో నిర్మించనున్నట్లు వెల్ల‌డించారు. 

కాగా చైనా జియాంగ్సు ప్రావిన్స్‌లోని సొరంగం 10.79 కిలోమీటర్ల పొడవు ఉంటుందని స‌ద‌రు అధికారి తెలిపారు. సొరంగంలోకి నీరు రాకుండా, వెంటిలేషన్ సిస్టమ్, ఫైర్ ఫైటింగ్ మెకానిజం, ఫుట్‌పాత్, డ్రైనేజీ సిస్టమ్, బ‌య‌ట‌కు వెళ్లేందుకు అత్య‌వ‌స‌ర మార్గం  మొదలైనవి ఉంటాయని తెలిపారు. వంతెనలను శత్రు దళాలు లక్ష్యంగా చేసుకునే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో బ్రహ్మపుత్ర కింద ఇంగ్లీష్ ఛానల్‌కు సమానమైన సొరంగాలను నిర్మించాల్సిందిగా సైన్యం ప్రభుత్వాన్ని కోరింది.


logo