గురువారం 21 జనవరి 2021
National - Dec 30, 2020 , 14:47:07

న్యూ ఇయ‌ర్ వేడుకల్ని నియంత్రించండి: రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశం

న్యూ ఇయ‌ర్ వేడుకల్ని నియంత్రించండి: రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశం

హైద‌రాబాద్‌:  కోవిడ్ వేళ న్యూ ఇయ‌ర్ సంబ‌రాల‌ను అరిక‌ట్టేందుకు  కేంద్ర ప్ర‌భుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది.  కొత్త ర‌కం క‌రోనా స్ట్రెయిన్ వ్యాప్తి అడ్డుకునేందుకు ఆ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసే విధంగా అన్ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచ‌న‌లు చేసింది.  స్థానికంగా ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి.. ఈనెల 30, 31వ తేదీతో పాటు జ‌న‌వ‌రి ఒక‌టో తేదీని ఆ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయాల‌ని కేంద్రం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.  అయితే తుది ఆదేశాల‌ను మాత్రం ఆయా రాష్ట్రాల‌కే కేంద్రం వ‌దిలివేసింది.

దేశంలో గ‌త కొన్నాళ్ల నుంచి కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ద‌ని, మూడున్న‌ర నెల‌ల నుంచి ఆ త‌గ్గుద‌ల క‌నిపిస్తోంద‌ని, కానీ ఇటీవ‌ల యూరోప్‌తో పాటు అమెరికాలో కొత్త స్ట్రెయిన్ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని, ఇలాంటి స‌మ‌యంలో అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, దేశంలో క‌ఠిన‌మైన రీతిలో నిఘా ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు ఆయా రాష్ట్రాల‌కు లేఖ రాశారు. 

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా నిర్వ‌హించే భారీ వేడుక‌ల‌ను నియంత్రించాల‌ని, శీతాకాలం కావ‌డం వ‌ల్ల కూడా వైర‌స్ ప్ర‌బ‌లే ఛాన్సు ఉంద‌ని, అయితే సూప‌ర్ స్ప్రెడ‌ర్‌ను అదుపు చేసేందుకు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌డం అవ‌స‌ర‌మ‌ని, జ‌నం  ఎక్కువ సంఖ్య‌లో గుమ్మిగూడే ఈవెంట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆ అధికారి త‌న లేఖ‌లో సూచించారు.   


logo