బుధవారం 15 జూలై 2020
National - Jun 18, 2020 , 10:06:54

చైనా టెలికాం పరికరాలను ఉపయోగించొద్దు!

చైనా టెలికాం పరికరాలను ఉపయోగించొద్దు!

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో.. భారత్‌ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా టెలికాం పరికరాలను ఉపయోగించకూడదని ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ను కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (డీవోటీ) కోరింది. దీనికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియను కూడా పునఃసమీక్షించాలని సూచించింది. ఇదే విధమైన సమాచారాన్ని అనుబంధ సంస్థ అయిన ఎంటీఎన్‌ల్‌కు కూడా జారీచేసిందని విశ్వసనీయ సమాచారం. ఆధునీకరణలో భాగంగా చైనా పరికరాలను వాడకూడదని అనుబంధ సంస్థ మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు డీవోటీ సూచించింది. 

చైనా కంపెనీలైన జెడ్‌టీఈ, హువావేలతో కలిసి సంయుక్తంగా దేశంలో 5జీ కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటుకు సంబంధించి భారత్‌ తన ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) వ్యూహంపై కూడా సమీక్షించే అవకాశం ఉంది. దేశంలోని ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు కూడా చైనా తయారుచేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించే విషయాన్ని టెలికాం శాఖ పరిశీలిస్తున్నది. 

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో నాలుగు... షియోమి, వివో, రియల్‌మీ, ఒప్పో కంపెనీలు చైనాకు సంబంధించినవే ఉన్నాయి. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వీటి వాటా 70 శాతంగా ఉన్నది.

తాజావార్తలు


logo