శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 13:53:48

ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ. 4,381 కోట్ల సాయం

ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ. 4,381 కోట్ల సాయం

ఢిల్లీ : జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ నిధి(ఎన్‌డీఆర్ఎఫ్‌) కింద ఆరు రాష్ర్టాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ.4,381 కోట్ల సాయం అందించేందుకు అనుమ‌తి తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో క‌మిటీ ఈ మేర‌కు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది తుఫాను, వరదల‌తో తీవ్రంగా దెబ్బ‌తిన్న రాష్ర్టాల‌కు ఈ నిధుల‌ను అంద‌జేయ‌నున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం ఈ ఆరు రాష్ట్రాలకు అదనంగా రూ. 4,381.88 కోట్ల సాయాన్ని అందించేందుకు క‌మిటీ ఆమోదం తెలిపింది. 

సైక్లోన్ అంఫాన్ కార‌ణంగా తీవ్రంగా దెబ్బ‌తిన్న ప‌శ్చిమ బెంగాల్‌కు రూ. 2,707.77 కోట్లు, ఒడిశాకు రూ. 128.23 కోట్లు అదేవిధంగా సైక్లోన్ నిస‌ర్గ కార‌ణంగా ప్ర‌భావిత‌మైన మ‌హారాష్ర్ట‌కు రూ. 268.69 కోట్లు, నైరుతి రుతుప‌వ‌నాల కార‌ణంగా సంభ‌వించిన వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం వంటి వాటితో ఇబ్బందులు ప‌డ్డ క‌ర్ణాట‌క‌కు రూ. 577.84 కోట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు 611.61 కోట్లు, సిక్కింకు 87.84 కోట్ల సాయాన్ని కేంద్రం మంజూరు చేసింది. 

సైక్లోన్ అంఫాన్‌తో అత‌లాకుత‌ల‌మైన ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ర్టాల‌ను ప్ర‌ధాని 22 మే, 2020న సంద‌ర్శించారు. ఆ సంద‌ర్భంగా స‌హాయ‌క చ‌ర్య‌ల నిమిత్తం ప‌శ్చిమ బెంగాల్‌కు రూ. వెయ్యి కోట్లు, ఒడిశాకు రూ. 500 కోట్లు ముంద‌స్తుగా విడుద‌ల చేశారు. అదేవిధంగా వ‌ర‌ద‌ల్లో చ‌నిపోయిన మృతుల‌కు రూ. 2 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేల‌ను సాయం ప్ర‌క‌టించారు. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని 28 రాష్ర్టాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు రూ. 15,524.43 కోట్ల‌ను సాయంగా అంద‌జేసింది.