నేటి నుంచి సెంట్రల్ విస్టా పనులు షురూ..

న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఇటీవల 14 మంది సభ్యులు హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ (హెచ్‌సీసీ) పార్లమెంట్ భవన నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వడంతో పనులు మొదలు పెట్టేందుకు మార్గం సుగమమైంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి హెరిటేజ్ కర్జర్వేటివ్ కమిటీతో పాటు సంబంధిత శాఖల అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం ఆయాశాఖల నుంచి అనుమతులు పొందిన తర్వాతనే పనులు చేపడుతోంది. ఈ మేరకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పనులు ప్రారంభించాలని కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న టాటా ప్రాజెక్ట్స్ కోరింది. మకర సంక్రాంతి మరుసటి రోజైన అత్యంత పవిత్రంగా భావించి నూతన పార్లమెంట్ భవన పనులకు శ్రీకారం చుడుతున్నారు. సెంట్రల్విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా దేశ అధికార కేంద్రంగా భావించే పార్లమెంట్‌ను త్రిభూకారంలో నిర్మించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో రాజ్‌పథ్‌ను ఆధునికీకరించనున్నారు. ప్రధాని నూతన నివాసం, కార్యాలయంతో పాటు ఉపరాష్ట్రపతికి నూతన భవనం నిర్మించారు. రాజ్‌పథ్ అభివృద్ధి పనులు ఈ నెల 26న జరిగే పరేడ్ అనంతరం మొదలు కానున్నాయి. పది నెలల కాలంలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పది నెలల్లో అందుబాటులోకి..
దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022 ఆగస్టు 15) నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. గత డిసెంబర్ 10న పీఎం మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.971 కోట్ల వ్యయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేంద్రం చేపడుతోంది. కొత్త భవనంలో 900 నుంచి 1,200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా త్రిభూజాకారంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా కొత్తగా పార్లమెంట్ నూతన భవనాన్ని కేంద్రం ప్రభుత్వం నిర్మిస్తోంది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ.971 కోట్ల వ్యయం చేయనుంది. ప్రస్తుత భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దగా ఉండనుంది. దాదాపు వంద సంవత్సరాల కిందట నిర్మించిన భవనం భవిష్యత్ అవసరాలకు సరిపోదని, అగ్ని ప్రమాదాలతో పాటు అనేక భద్రతా పరమైన సమస్యలున్నాయని, ఈ మేరకు నూతన భవనం అవసరమని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు భూ వినియోగంలో చట్ట విరుద్ధమైన మార్పులు, వారసత్వ సంపద పరిరక్షణ నియమాల ఉల్లంఘన, డిజైన్, పర్యావరణ అనుమతులు తదితర అంశాలను లేవనెత్తుతూ సుప్రీం కోర్టులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. శంకుస్థాపనకు అనుమతినిచ్చిన సుప్రీం కోర్టు.. నిర్మాణాలకు మాత్రం బ్రేక్ వేసింది. తుది తీర్పు వచ్చేంతవరకూ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు, భవనాల కూల్చివేత, చెట్ల నరికివేత చేపట్టొద్దని ఆదేశాలిచ్చింది. ఈ నెల 7న పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఆ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ విస్టా నిర్మాణం కోసం తెచ్చిన అన్ని అనుమతులు సక్రమంగానే ఉన్నట్లు న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది.
అణువణువునా భారతీయత ప్రతిభింబించేలా..
కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిభింబించేలా తీర్చిదిద్దనున్నారు. పురివిప్పి ఆడుతున్న నెమలి (జాతీయపక్షి), ఆకృతిలో లోక్‌సభ పైకప్పు, విరబూసిన కమలం (జాతీయ పుష్పం) రూపంలో రాజ్యసభ పైకప్పు, పార్లమెంట్లో అంతర్భాగంగా నిలువనున్న జాతీయ వృక్షం మర్రిచెట్టు రూపంలో తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని పోలి ఉండనున్న నూతన భవనం రూపు. పార్లమెంట్ కొత్త భవనంలో గ్రౌండ్, మొదటి, రెండు అంతస్థులు ప్రస్తుత భవనం ఎత్తు ఉండేలా కొత్త భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఒకే సారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేయనున్నారు. భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. విశాలమైన లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు సైతం ఉండనున్నాయి. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంపీలకు అధునాత సౌకర్యాలు
ప్రస్తుత భవనంలో తొలి రెండు వరుసల్లో కూర్చున్న ఎంపీలకు మాత్రమే డెస్క్‌లు ఉన్నాయి. కొత్త భవనంలో సభ్యులందరికీ డెస్క్‌లు ఉండేలా ఏర్పాట్లున్నాయి. ప్రతి ఎంపీకి టచ్ స్క్రీన్‌తో కూడిన డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. లోక్‌సభే సెంట్రల్ హాలుగా 1315 చదరపు మీటర్లలో విస్తరించి ఉండనుంది. లోక్‌సభను ఆనుకొని ప్రధానమంత్రి కార్యాలయం, 20 మీటర్ల ఎత్తులో కానిస్టిట్యూషనల్ హాల్, దానిపై అశోక స్థూపం నిర్మించనున్నారు. ప్రస్తుత భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనం చుట్టూ నిలువెత్తు రాతి స్తంభాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్యాలరీల్లో కూర్చునే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీల కోసం రెండు గేట్లు, ఎంపీల వాహనాలు వచ్చేందుకు మరో రెండు, సాధారణ ప్రజలు, మీడియా, సందర్శకుల కోసం మరో రెండు భవనానికి గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవనంలో అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవన ఆకృతిని గుజరాత్‌కు చెందిన హెచ్పీసీ సంస్థ రూపొందించగా.. నిర్మాణ బాధ్యతలను టాటా సంస్థ దక్కించుకంది. నిర్మాణంలో ప్రత్యక్షంగా రెండువేల మంది, పరోక్షంగా 9వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. 1921, ఫిబ్రవరి 21న ప్రస్తుత పార్లమెంట్‌కు శంకుస్థాపన చేయగా.. ఆ సమయంలో రూ.83లక్షలు వ్యయమైంది. ఆరేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. 1927, జనవరి 18న పార్లమెంట్ ప్రారంభోత్సవం చేశారు.
తాజావార్తలు
- పదపద.. ప్రచారానికి..
- ఇక ప్రజా క్షేత్రంలో...సమరమే..
- ఏపీ అమరావతిలో వింత శబ్దాలతో భూకంపం
- మార్చిలోనే మధురఫలం
- రాష్ట్రంలో 39 డిగ్రీలకు చేరిన ఎండలు
- 27-02-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- జీవకోటికి.. ప్రాణవాయువు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్‌షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం