శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 05, 2020 , 10:05:41

చర్చలు కొలిక్కి వచ్చేనా?..

చర్చలు కొలిక్కి వచ్చేనా?..

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై మరోసారి రైతు సంఘాలు, కేంద్రమంత్రులతో శనివారం మరో విడత చర్చలు జరుగనున్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే మంగళ, గురువారాల్లో చర్చలు జరిగినా ఏ నిర్ణయానికి రాలేకపోయారు. ఇవాళ జరిగే సమావేశంలోనైనా కొలిక్కి వస్తాయా? లేదా? మరికొద్ది గంటల్లో తెలియనుంది. గురువారం జరిగిన చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ శనివారం జరిగే చర్చలు ఏదో ఒక నిర్ణయానికి రానున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రైతులు మాత్రం ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే జాతీయ రహదారులను దిగ్బంధించి, టోల్‌గేట్లలో వసూళ్లు చేపట్టకుండా అడ్డుకోనున్నట్లు ప్రకటించారు. గురువారం నాటి చర్చల్లో ఎంఎస్‌పీ, మండీలను బలోపేతం చేసేందుకు, వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని 40 రైతు సంఘాలకు కేంద్రమంత్రులు నరేందర్‌ సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌ హామీ ఇచ్చారు. అయితే కేంద్రం ప్రతిపాదనలను మాత్రం రైతు సంఘాల నేతలు అంగీకరించడం లేదు. ప్రత్యేకంగా పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించి.. చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, వివిధ వర్గాల సమాచారం ప్రకారం.. రైతు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన అంశాలపై ప్రభుత్వం సాధ్యమైనంత వరకు పరిష్కారాలు రూపొందించిందని, శనివారం జరిగే సమావేశంలో ప్రతిష్ఠంభన తొలగుతుందని భావిస్తున్నారు.