మంగళవారం 14 జూలై 2020
National - Jul 01, 2020 , 12:27:19

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స

ఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు తక్షణ సహాయార్థం రూ.2.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సా పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర రోడ్లు, రహదారుల మంత్రిత్వశాఖ తన సొంత నిధులతో అదేవిధంగా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(జీఐసీ) సహకారంతో మోటారు వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్రం ప్రకారం.. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో ఇన్సూరెన్స్‌ ఉన్న సంఘటనల్లో బాధితుల కోసం అయ్యే ఖర్చులను జీఐసీ భరిస్తుందన్నారు. కాగా బీమా చేయని వాహనాలకు సంబంధించి ఖర్చును కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ భరిస్తుంది. 

నేషనల్‌ హెల్త్‌ అథారిటీకి చెందిన ఐటీ ప్లాట్‌ఫాంలు ప్రమాదం జరిగిన మొదటి గంటలో చికిత్స కోసం ఉపయోగించబడతాయన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజనను అమలు చేసేందుకు సైతం ఎన్‌హెచ్‌ఏకు చెందిన ఐటీ ప్లాట్‌ఫాంలు ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. నగదు రహిత పథకం పరిధిలోకి వచ్చే రహదారి ప్రమాద బాధితులకు ఆరోగ్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర రహదారి మంత్రిత్వశాఖ కింద ఒక ఖాతా ఏర్పాటు చేయబడుతుంది. ఈ నగదు రహిత పథకంతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.


logo