బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 19:29:02

వచ్చే నెల నుంచి పెరగనున్న టీవీల ధరలు...

 వచ్చే నెల నుంచి పెరగనున్న టీవీల ధరలు...

ముంబై : ఎల్ ఈడీ టీవీల తయారీ కోసం వినియోగించే ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే తప్పనిసరిగా  టీవీల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. 2017 డిసెంబర్ నుంచి టీవీ విడిభాగాలపై 20 శాతం కస్టమ్స్ సుంకం ఉన్నది. అయితే ఓపెన్ సెల్ తయారీ దేశీయంగా చేపట్టేవరకు, దిగుమతికి అంగీకరించాలని పరిశ్రమ కోరడంతో 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పరిశ్రమకు ఇచ్చిన గడువు ఈ నెలతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఓపెన్ సెల్ పైన గతంలో ప్రకటించినట్లుగా 5 శాతం కస్టమ్స్ సుంకం అమలవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

సుంకం విధించకపోతే, విడిభాగాలు తయారు చేయకుండా, దిగుమతి చేసుకొని, టీవీల అసెంబ్లింగ్ మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గడువు తీరిపోవడంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సుంకం విధింపు నేపథ్యంలో టీవీల ధరలు పెరగనున్నాయి. ఓపెన్ సెల్స్ పైన ఐదు శాతం సుంకం విధిస్తే టీవీ ధరలు పెంచాల్సి వస్తుందని దేశీయ టీవీ తయారీదారులు అన్నారు. సుంకం విధింపుతో టీవీల ధరలు దాదాపు నాలుగు శాతం వరకు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రూ.600 నుంచి రూ.1500 వరకు ధరలు పెరగనున్నాయి.

32 ఇంచుల నుండి 42 ఇంచుల టీవీల ధరలు రూ.600 నుంచి రూ.1500 వరకు పెరుగుతాయని, పెద్ద స్క్రీన్ టీవీల ధరలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా తయారు చేసిన ప్యానల్ ధర ఇప్పటికే 50 శాతం పెరిగిందని, ఓపెన్ సెల్ పైన ఇప్పుడు 5 శాతం కస్టమ్స్ విధించడం వల్ల ధరలు పెంచాల్సిన పరిస్థితి అంటున్నారు. అయితే ఓపెన్ సెల్‌ను ప్రముఖ బ్రాండెడ్ సంస్థలు రూ.2700 నుంచి రూ.4500 చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయని, ఓపెన్ సెల్ ప్రాథమిక ధరను బట్టి దిగుమతి సుంకం భారం రూ.150 నుంచి రూ.250కి మించదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 


logo