గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 18, 2021 , 00:55:56

ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

  • అభ్యంతరకరమైన ప్రసారాలపట్ల ఆగ్రహం
  • పరిస్థితిలో మార్పు రాకుంటే చర్యలుంటాయని హెచ్చరిక

న్యూఢిల్లీ: ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తమ వేదికలపై ప్రదర్శించే సినిమాలు లేదా వెబ్‌ సిరీస్‌లను ఆయా ఓటీటీ యాజమాన్యాలే సొంతగా పర్యవేక్షించుకోవాలని సూచించింది. తద్వారా ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేసింది. ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటించకపోతే.. తామే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.   ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సంబంధించి పలు రాష్ర్టాల హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీల చిత్రాల ప్రసారాన్ని అరికట్టడానికి మార్గదర్శకాలను రూపొందించాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ గతేడాది ఓటీటీ సంస్థలతో మూడుసార్లు సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆ చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదని ఓటీటీల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్తాపత్రికల నియంత్రణకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై  కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ నియంత్రణ ఉన్నట్లే, ఓటీటీ సంస్థలు కూడా స్వీయ నియంత్రణ సంస్థను కలిగి ఉండాలని వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫావ్‌ులో కొత్తగా వచ్చిన ‘తాండవ్‌' వెబ్‌సిరీస్‌పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ‘తాండవ్‌' చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు, మాటల పట్ల.. చాలా సంస్థలు అసంతృప్తిని వ్యక్తం చేశాయని తెలిపింది. ఈ చిత్రాన్ని నిషేధించాలని ఫిర్యాదులు అందినట్టు వెల్లడించింది.

VIDEOS

logo