శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 02:05:19

అష్టదిగ్బంధం!

అష్టదిగ్బంధం!
 • కరోనా కట్టడికి కేంద్రం కఠిన చర్యలు
 • భూ, జల, వాయు మార్గాలు మూసివేత
 • పలు రాష్ర్టాల్లో ప్రజల కదలికలపై ఆంక్షలు
 • నిషేధిత జాబితాలో ఈయూ, టర్కీ, బ్రిటన్‌
 • ఆయా దేశాల్లోని భారతీయులకూ నో ఎంట్రీ
 • దేశంలో 114కు పెరిగిన బాధితులు

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/మాడ్రిడ్‌/పారిస్‌, మార్చి 16: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్‌ దిగ్బంధం దిశగా సాగుతున్నది. ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వైరస్‌ భారత్‌లో విస్తరించకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్నది. భూ, జల, వాయు మార్గాలను దాదాపు మూసివేసింది. ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దుల్లో అత్యధిక శాతం మూసివేసింది. విదేశీ నౌకలన్నింటినీ తీరప్రాంతాల్లో నిలిపివేస్తూ జలమార్గాలపై ఆంక్షలు విధించింది. వాయుమార్గంలో ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటికే వీసాలన్నింటినీ రద్దు చేసింది. విదేశీయుల రాకపై కఠిన ఆంక్షలు విధించింది. తాజాగా.. కరోనా ప్రభావిత దేశాల నుంచి భారతీయుల రాకపైనా నిషేధాన్ని విధించింది. మరోవైపు దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల్లో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఇతరత్రా జన సమ్మర్ధ ప్రదేశాలను మూసివేశారు. 


31 వరకు అనుమతించం 

ఇప్పటికే పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించిన కేంద్రం.. సోమవారం ఈయూ, బ్రిటన్‌, టర్కీ దేశాలను చేర్చింది. ఆయా దేశాల నుంచి వచ్చే భారతీయులకూ ఎలాంటి మినహాయింపు లేదని ప్రభుత్వం తెలిపింది. ఆ దేశాల నుంచి ఒక్క విమానాన్నీ భారత్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇది ఈ నెల 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పింది. దీంతో బ్రిటన్‌, టర్కీ, ఐరోపా దేశాలకు చెందిన పౌర విమానయాన సంస్థలు ఈ నెలాఖరు వరకు తమ సర్వీసులను భారత్‌కు నిలిపివేయనున్నాయి.


చాపకింద నీరులా.. 

భారత్‌లో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తున్నది. ఒడిశాలో సోమవారం తొలి కరోనా కేసు నమోదు కాగా, లడఖ్‌, జమ్ముకశ్మీర్‌, కేరళలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య సోమవారంనాటికి 114కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో ఇద్దరు మృతి చెందగా, 13 మంది ఇప్పటికే డిశ్చార్జీ అయ్యారని తెలిపింది. వైరస్‌ సోకిన వాళ్లలో 17 మంది విదేశీయులు ఉన్నారని వెల్లడించింది. మహారాష్ట్రలో వైరస్‌ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సోమవారం మరో నలుగురిలో వైరస్‌ లక్షణాల్ని గుర్తించామని మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 37కు చేరింది. కేరళలో మూడు, కర్ణాటకలో మరో కేసు నమోదైంది. అయితే వీటిని కేంద్రం ధ్రువీకరించాల్సి ఉన్నది.


గుమిగూడొద్దు: కేజ్రీవాల్‌ 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. 50మందికి మించి హాజరయ్యే ఎలాంటి  కార్యక్రమాలను మార్చి 31 వరకు రాజధానిలో అనుమతించబోమని ప్రకటించారు. మరోవైపు, ఇరాన్‌లో చిక్కుకున్న మరో 53 మంది భారతీయులతో కూడిన నాలుగో బృందాన్ని ఎయిరిండియా విమానం సోమవారం ఢిల్లీకి తీసుకొచ్చింది. కొవిడ్‌ నేపథ్యంలో జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో ముందస్తు వేసవి సెలవుల్ని ప్రకటించారు. మార్చి 21 నుంచి మే 25 వరకు ఈ సెలవులు కొనసాగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 


ఆహార కొరత లేదు

కరోనా వల్ల రానున్న రోజుల్లో దేశంలో నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు దొరకవన్న వదంతుల నేపథ్యంలో అమెరికన్‌ ప్రజలు సూపర్‌ మార్కెట్లు, ఫుడ్‌ కోర్టుల ముందు బారులు తీరారు. దీనిపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తూ.. దేశంలో ఆహారం, నిత్యవసర వస్తువుల కొరత లేదన్నారు. 


ఇటలీలో ఒక్కరోజే 349 మంది మృతి 

అంతర్జాతీయంగా కరోనా తన పంజా చూపిస్తున్నది. ముఖ్యంగా ఇటలీలో కరాళనృత్యం చేస్తూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. ఇటలీలో ఆదివారం మూడువందలమందికి పైగా మరణించగా.. సోమవారం కూడా 349 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఇటలీలో మృతుల సంఖ్య రెండు వేలకు పెరిగింది. ఇరాన్‌లోనూ కరోనా పంజా విసురుతున్నది. వైరస్‌ ధాటికి ఆ దేశంలో మృతుల సంఖ్య 853కు చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ మహమ్మారి వల్ల 7,007 మంది మరణించగా, మరో 1,75,536మందికి వైరస్‌ సోకింది.

 • స్పెయిన్‌లో గత 24 గంటల్లో 1,200 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ దేశంలో మొత్తం కేసులు 9,100 దాటాయి. 
 • వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వెనిజులాలోని ఏడు రాష్ర్టాల్ని సామూహికంగా దిగ్బంధం చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
 • అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఏప్రిల్‌ 20 వరకు అన్ని పబ్లిక్‌ స్కూళ్లను మూసివేశారు. 
 • తమ దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్నదని, ప్రతి మూడు రోజులకు బాధితుల సంఖ్య రెట్టింపు అవుతున్నదని ఫ్రాన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది.   
 • కరోనా వెలుగుచూసిన వుహాన్‌ నగరంలో వైరస్‌ తీవ్రత తగ్గిపోవడంతో అక్కడున్న వైద్య సిబ్బందిని చైనా దశల వారీగా వెనక్కి పిలిపిస్తున్నది.


logo