శుక్రవారం 03 జూలై 2020
National - Apr 26, 2020 , 01:44:43

లాక్‌డౌన్‌ వేళ మినహాయింపులు

లాక్‌డౌన్‌ వేళ మినహాయింపులు

  • నివాస ప్రాంతాల్లోని దుకాణాలు తెరుచుకోవచ్చన్న కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నిబంధనల్లో కొన్నింటికి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. స్వతంత్రంగా వ్యాపారం చేసే మొబైల్‌ దుకాణాలు, గార్మెంట్స్‌, స్టేషనరీ, హార్డ్‌వేర్‌ దుకాణాలను తెరుచుకోవచ్చునని పేర్కొన్నది. అయితే, ఈ సడలింపులు మార్కెట్‌లు, మాల్స్‌, కొవిడ్‌-19 హాట్‌స్పాట్‌ కేంద్రాలు, కంటైన్మెంట్‌ జోన్లకు మాత్రం వర్తించవని శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఆదేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ ప్రాం తాల్లో లాక్‌డౌన్‌ నిషేధాజ్ఞలు వచ్చే నెల మూడో తేదీ వరకు యథాతథంగా అమలులో ఉంటాయి. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చే నివాస ప్రాంతాల్లోని దుకాణాలను తెరిచేందుకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే సింగిల్‌ బ్రాండ్‌ లేదా బ్రాండెడ్‌ వస్తువులను విక్రయించే మాల్స్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలోని దుకాణాలకు మాత్రం అనుమతిలేదని స్పష్టంచేసింది. వ్యాపారాలు చేసుకోవడానికి మినహాయింపు పొందినవారు 50 శాతం సిబ్బందిని మాత్రమే వినియోగించాలని, తప్పనిసరిగా నిర్ణీత దూరం పాటించాలని, ముఖాలకు విధిగా మాస్క్‌లు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని కేంద్రం నియమాలను విధించింది.


logo