బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 16:04:54

పదేళ్ల తర్వాత కేరళకు కేంద్రం నిధులు

పదేళ్ల తర్వాత కేరళకు కేంద్రం నిధులు

తిరువనంతపురం : పదేళ్ల విరామం తర్వాత కేరళ ప్రతిష్టాత్మక అక్షరాస్యత అభియాన్‌ కార్యక్రమానికి ‘పడ్నా లిఖ్నా అభియాన్‌’ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. 2030 నాటికి దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాన్ని సాధించడం కోసం.. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 57 లక్షల మంది నిరక్షరాస్యులు, వయోజనులకు చదవడం, రాయడం నేర్పడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన కేరళ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీ (కేఎస్‌ఎల్‌ఎంఏ) శుక్రవారం మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల్లో మొదటిసారిగా అక్షరాస్యతా కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందని, ఇది వంద శాతం అక్షరాస్యత సాధించిన తర్వాత ఓ ముఖ్యమైన ముందడుగని పేర్కొంది. 2009 తర్వాత కేంద్ర ప్రభుత్వం అనియత విద్య కోసం కేరళకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. కేరళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త అక్షరాస్యత అభియాన్ ‘పద్నా లిఖ్నా అభియాన్‌’లో భాగమని, ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మినిట్స్‌ను విడుదల చేసింది.


మొత్తం రూ.4.74 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో కేంద్రం రూ.2.84 కోట్లు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.90 కోట్లు మంజూరు చేస్తుందని కేఎస్ఎల్ఎంఏ డైరెక్టర్ పీఎస్ శ్రీకళ తెలిపారు. తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాల్లోని మహిళలు, షెడ్యూల్డ్‌ కుల, తెగ ప్రజలు, తీర ప్రాంత వాసులకు ప్రాధాన్యం లభించనుంది. విద్యాపరంగా వెనుకబడిన జిల్లాలైన వయనాడ్‌, ఇడుక్కి, పాలక్కాడ్‌, మలప్పురానికి చెందిన 1.15లక్షల మంది నిరక్షరాస్యులు మొదటి దశలో అక్షరాస్యులవుతారని కేఎస్‌ఎల్‌ఎంఏ వర్గాలు తెలిపాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఈ జిల్లాల్లో 6,12,624 నిరక్షరాస్యులు ఉండగా, వారిలో 4,27,166 మంది మహిళలు ఉన్నారు. కార్యక్రమం అమలుకు ముందు మిషన్ ఒక సర్వే నిర్వహించి, గుర్తించనుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల మధ్య కేఎస్‌ఎల్‌ఎం ద్వారా అమలు చేస్తున్న వివిధ నిరంతర విద్యా క్రమాలు దక్షిణాది రాష్ట్రానికి కేంద్ర నిధి జాబితాలో చోటు దక్కించుకోవడానికి సహాయపడ్డాయని వర్గాలు తెలిపాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.