గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 01:14:48

దిగ్బంధ భారత్‌

దిగ్బంధ భారత్‌

-కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ర్టాల కఠిన నిర్ణయాలు

-దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించిన కేంద్రం

-స్వీయ నిర్బంధం ప్రకటించిన ఏడు రాష్ర్టాలు

-ఈ నెల 31 వరకు అమలు.. 

-అత్యవసర సేవలకు మినహాయింపు

-అంతర్జాతీయ విమానాలు బంద్‌

-ప్యాసింజర్‌ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ర్ట బస్సు సర్వీసులు బంద్‌

-కేసులు 360.. మృతులు 7

న్యూఢిల్లీ, మార్చి 22: ప్రాణాంతక కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం దిగ్బంధం దిశగా సాగుతున్నది. విశ్వమారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌(స్వీయ నిర్బంధం) అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నాయి. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్‌ను విధించింది. మరోవైపు, ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్టు పంజాబ్‌, చండీగడ్‌, ఢిల్లీ, ఉత్తరఖండ్‌, నాగాలాండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు, ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకు గూడ్స్‌ మినహా అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, అంతర్రాష్ర్ట బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వైరస్‌ బారిన పడి ఇప్పటికే దేశంలో ఏడుగురు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

సకలం బంద్‌

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో 17 రాష్ర్టాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి, క్యాబినెట్‌ కార్యదర్శి, వివిధ రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో ఆదివారం ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఆంక్షల్ని ఉల్లంఘించే వారికి నెలరోజుల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉన్నదని  హెచ్చరించారు. కోల్‌కతాతో పాటు పలు పట్టణాల్లో సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 27 వరకూ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో బుధవారం వరకు లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు సీఎం ఆదిత్యనాథ్‌ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు బీహార్‌ సర్కార్‌ ప్రకటించింది. రాష్ట్రంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు మహారాష్ట్ర వెల్లడించింది. తొమ్మిది జిల్లాల్లో అన్ని వాణిజ్య కార్యకలాపాలను బంద్‌ చేస్తున్నట్లు కర్ణాటక తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆదివారం నుంచి నిలిచిపోయాయి.

360కి పెరిగిన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారంనాటికి వైరస్‌ సోకిన వారి సంఖ్య 360, మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు చనిపోయారు. బీహార్‌, ముంబై, గుజరాత్‌లోని సూరత్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అయితే ఐసీఎంఆర్‌ మాత్రం 396 మందికి కరోనా పాజిటివ్‌గా పేర్కొన్నది. 

ఉచిత పరీక్షలకు సిద్ధం

కరోనాను గుర్తించే పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడంతోపాటు మహమ్మారి సోకిన వారికి ఉచితంగా చికిత్సనందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి తెలిపారు. మహారాష్ట్రలో 1,874 మంది రక్త నమూనాల్ని ల్యాబ్‌లకు పంపించామని, 72 మందికి పాజిటివ్‌ వచ్చిందని, 210 మంది ఫలితాలు రావాల్సి ఉన్నదని ప్రభుత్వం పేర్కొంది.ఏ రాష్ట్రంలో ఎన్ని లాక్‌డౌన్‌ జిల్లాలు

17 రాష్ర్టాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. కేరళ, మహారాష్ట్రలో పది జిల్లాల చొప్పున, ఢిల్లీలో ఏడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో ఆరు జిల్లాల చొప్పున, హర్యానా, కర్ణాటక,  రాజస్థాన్‌లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడులో మూడు జిల్లాలు, పశ్చిమ బెంగాల్‌, జమ్ముకశ్మీర్‌, లఢక్‌లో రెండు జిల్లాలు, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, చండిగడ్‌, ఉత్తరఖండ్‌, పుదుచ్చేరిలో ఒక్కో జిల్లా, తెలంగాణలోని  హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో  కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. 

31 వరకు రైళ్లు బంద్‌

ఈ నెల 31 వరకు అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, అంతర్రాష్ర్ట బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు 13,523 రైలు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడవనున్నాయని తెలిపింది. మెట్రో రైళ్లు సైతం 31 వరకు నిలిచిపోనున్నాయి. అన్ని రకాల వాణిజ్య వాహనాలు రోడ్ల మీద తిరగకుండా మంగళవారం వరకు నిషేధిస్తున్నట్టు అసోం ప్రభుత్వం  ప్రకటించింది.logo