ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 20, 2021 , 08:43:49

రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు

రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం పదో రౌండ్‌ చర్చలు జరుపనుంది. సమావేశం మంగళవారం జరుగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ విజ్ఞాన్‌ భవనంలో చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు 40 రైతు సంఘాల నేతలకు వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ లేఖ రాశారు. ఇంతకు ముందు ఈ నెల 15న జరగ్గా.. ఎటూ తేలకుండానే ముగిశాయి. ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన చర్చలూ కొలిక్కి రావడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయ ప్రజాప్రయోజనాల కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంచి చర్యలు తీసుకున్నప్పుడల్లా అడ్డంకులు వస్తాయని, రైతుల నాయకులు తమదైన రీతిలో పరిష్కారం కోరుకుంటున్నందున సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని కేంద్రం పేర్కొంది.

ఇదిలా ఉండగా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ తన మొదటి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. వ్యవసాయ చట్టాలకు సభ్యులు అనుకూలంగా ఉన్నారని, సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ను రైతులు ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. చట్టాలను రద్దు చేయడం, పంటలకు కనీస మద్దతు ధర తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే చట్టాల రద్దు మినహా దేనికైనా అంగీకారమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో చర్చలపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు రెండు నెలలుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

VIDEOS

logo