రైతు ప్రతినిధులతో కేంద్రం మరోసారి చర్చలు

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ప్రతినిధులతో కేంద్రం మరోసారి చర్చలు జరుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 1న జరిగిన చర్చల సందర్భంగా రైతు సంఘాల నుంచి చట్టాలపై ఉన్న అనుమానాలు, అభ్యంతరాలను కేంద్రమంత్రులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లేవనెత్తిన అభ్యంతరాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. గురువారం రెండో విడత చర్చలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌తో బుధవారం చర్చించారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై నిర్మాణాత్మకంగా ఎలా స్పందించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. ఇవాళ రైతులతో చర్చలకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌తో అమిత్ షా భేటీ అవుతున్నారు. కొద్ది రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరువురి మధ్య చర్చ జరుగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బిల్లుల రద్దుకు ప్రత్యేక పార్లమెంట్ నిర్వహించాలి
మరో వైపు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంట్ భేటీకావాలన్న రైతు నేతలు కేంద్రంతో ఇవాళ జరిగే చర్చల్లో మరోసారి అంశాల వారీగా వివరిస్తామని స్పష్టం చేశారు. బిల్లుల రద్దు తప్ప తమకు మరేదీ సమ్మతం కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఏడో రోజు బుధవారం ఉధృతంగా సాగింది. రైతులకు మద్దతుగా ఢిల్లీలోని సరిహద్దులకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.
విస్తరిస్తున్న ఉద్యమం
ఇప్పటి వరకు పంజాబ్, హర్యానా సరిహద్దులకు పరిమితమైన రైతుల ఉద్యమం ఉత్తరప్రదేశ్ సరిహద్దులకూ వ్యాపించింది. మూడు రాష్ట్రాలకు చెందిన కర్షకులు ఆందోళనకు దిగడంతో ఈ సెగ ఢిల్లీకి తాకింది. నగరానికి వచ్చే ఐదు మార్గాలను మూసివేయాల్సిన పరిస్థితి ఎదురైంది. హర్యానా సరిహద్దులోని సింఘు, తిక్రీ వద్ద వారం రోజులుగా ధర్నా కొనసాగుతుండగా.. ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలైన ఫిరోజ్‌బాద్, మీరట్ నుంచి వేలాదిగా రైతులు తరలివస్తుండడంతో నోయిడా సమీపంలోని చిల్లా సరిహద్దు వరుసగా రెండో రోజూ మూతపడింది. అక్కడున్న రైతులంతా గౌతమ్ బుద్ధ ద్వార్ వద్ద ఆందోళన చేస్తున్నారు. అన్నదాతలను నిలువరించేందుకు అన్ని చోట్ల భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఆందోళనకు పెరుగుతున్న మద్దతు
రైతుల ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. రైతులకు సంఘీభావంగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద వామపక్షాలు ప్రదర్శన నిర్వహించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లపై బైఠాయించిన నేతలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి రైతులకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, బీవీ రాఘవులు పాల్గొన్నారు. ఢిల్లీ చలో ఆందోళనకు బయలుదేరిన రైతులపై హర్యానా ప్రభుత్వం నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై చండీగఢ్‌లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సీఎం మనోహర్ కట్టర్ నివాసాన్ని ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా ఈ నెల 8 ఉత్తరాదిలో వాహనాలు నిలిపివేయనున్నట్లు ఆలిండియా మోటార్ ట్రాన్స్‌ఫోర్ట్ (ఏఐఎంటీసీ) ప్రకటించింది. ప్రభుత్వం స్పందించపోతే దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు హెచ్చరించింది. సంఘం పరిధిలో 95లక్షల లారీలు, 50లక్షల బస్సులు, ట్యాక్సీలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు విద్యార్థి సంఘాల నాయకులు సైతం రైతులకు మద్దతు ప్రకటించారు. కేంద్రం వెంటనే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి