శనివారం 16 జనవరి 2021
National - Dec 03, 2020 , 01:13:11

రైతుకు ఉరేస్తున్న కేంద్రం

రైతుకు ఉరేస్తున్న కేంద్రం

  • కొత్త మార్కెట్‌ చట్టం వ్యాపారుల చుట్టం
  • ప్రైవేటు మార్కెట్లో రైతులకు కుచ్చుటోపీ ఖాయం
  • భవిష్యత్‌ మార్కెట్లో ఒకే వ్యాపారి.. ఒక ధర
  • పంట కొనుగోళ్లలో పోటీతత్వం అంతర్థానం
  • రైతును దాటి మార్కెట్‌ వ్యవస్థ ఉండొద్దు 
  • రైతు పంటను ఆన్‌లైన్‌లో అమ్ముకోవటం అసాధ్యం 
  • ఒప్పంద వ్యవసాయంతో కార్పొరేట్లకే లాభం 
  • మోదీ సర్కారు కుట్రలను బట్టబయలు చేసిన ఎన్‌ఆర్‌ఏఎస్‌ 

ఈ-నామ్‌తో వ్యాపారులకే మేలు.. 

దేశంలోని మొత్తం మార్కెట్లను అనుసంధానించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ-నామ్‌ మార్కెటింగ్‌ వ్యవస్థ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ఎన్‌ఆర్‌ఏఎస్‌ తెలిపింది. ఈ-నామ్‌లో 150 రకాల పంట ఉత్పత్తులను విక్రయించే అవకాశం ఉన్నా వ్యాపారులు కావాలనే కేవలం ఒకే వస్తువును క్రయవిక్రయాలు జరుపుతారు. తద్వారా వ్యాపారులు మాత్రమే లాభ పడతారని నివేదిక పేర్కొంది. ఇక 70 శాతం విత్తన, వ్యవసాయ రసాయనాలను నాలుగు సంస్థలే శాసిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేసింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మార్కెట్‌ వ్యవస్థ ఎప్పుడూ రైతును దాటి ఉండకూడదు.. ఒకవేళ అదే జరిగితే కర్షకుడికి మరణ శాసనమే అవుతుంది’ అని ఎన్‌ఆర్‌ఏఎస్‌ నివేదిక హెచ్చరించింది. ప్రైవేటు వ్యాపారులు, మార్కెట్లు రైతులకు ఎప్పటికీ మేలు చేయవని స్పష్టంచేసింది. ప్రైవేటు మార్కెట్లో వ్యాపారిదే గుత్తాధిపత్యం ఉంటుందని, పంటల కొనుగోళ్లలో వేలం లేకపోవడంతో దళారులు నిర్ణయించిన ధరకే రైతులు పంటలను అమ్ముకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొంది. ప్రైవేటు మార్కెట్లో అన్యాయం జరిగినా రైతులు ఏమీ చేయలేరని, అదే ప్రభుత్వ మార్కెట్లో అయితే రైతుకు సర్వ హక్కులుంటాయని తెలిపింది. కంపెనీలు వారి వ్యాపార భాగస్వామ్యులకు జవాబుదారీగా ఉంటాయే తప్ప.. రైతుకు ఎప్పటికీ జవాబుదారీగా ఉండవనే విషయం గ్రహించాలని సూచించింది. 

రైతుకు కొనుగోలుదారున్ని దూరం చేయడమే 

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన మార్కెట్‌ చట్టం రైతు పరిధిని దాటి (బైపాస్‌ ది ఫార్మర్‌) ఉన్నదని నివేదిక పేర్కొంది. రైతులకు మార్కెట్లు చాలా కీలకం. పంటలకు సరైన ధర నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి మార్కెట్లను తొలడించడమంటే రైతుకు కొనుగోలుదారుడు లేకుండా చేయడమేనని విశ్లేషించింది. ఇలాంటి కీలకమైన మార్కెట్‌ వ్యవస్థను రైతుకు దూరం చేయడంకన్నా దాన్ని సంస్కరించి జవాబుదారీతనాన్ని పెంచాలని సూచించింది. మార్కెటింగ్‌ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి బీహార్‌ సరైన ఉదాహరణ. ఆ రాష్ట్రంలో 2006లో మార్కెట్‌ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటను కొనేవాళ్లు లేక, ఎక్కువకాలం నిల్వచేసుకొనే పరిస్థితి కూడా లేక వ్యాపారులు ఎంతకు అడిగితే అంతకే తెగనమ్ముకున్నారని నివేదిక ఉదహరించింది.

ఆన్‌లైన్‌లో అమ్ముకోగలడా? 

రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఆన్‌లైన్‌ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లలో విక్రయించడం అంత సులువు కాదని  ఎన్‌ఆర్‌ఏఎస్‌ తన అధ్యయనంలో తేల్చింది. ఆన్‌లైన్‌లో పంటను అమ్ముకోవాలంటే రైతుకు భారీ మొత్తంలో ఉత్పత్తులు ఉండాలి. కానీ మనదేశంలో అది సాధ్యపడదు. దేశంలో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. దాంతో 90 శాతం మంది రైతులకు ప్రభుత్వం చెప్తున్న విధానంలో పంటలను విక్రయించడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. ఈ విధానం రైతులకన్నా వ్యాపారులకు, వ్యవసాయ వాణిజ్య సంస్థలకే ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొంది. 

సీసీఐ, ఎఫ్‌సీఐ మద్దతు ధర ఇస్తున్నాయా..? 

పంట కొనుగోళ్లలో మార్కెట్లకు కాకుండా వ్యాపారులకే పెత్తనం అంటగడితే రైతుల భవిష్యత్‌ అంధకారమేనని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత విధానంలోనే రైతులకు మద్దతు ధర లభించడం లేదు.. ఇక నూతన విధానంలో ఏ విధంగా లభిస్తుందో కేంద్రమే చెప్పాలి. ప్రస్తుతం పత్తి కొనుగోలు చేస్తున్న సీసీఐ, ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఎఫ్‌సీఐ ఎంతమేర మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. వ్యవసాయోత్పత్తుల నాణ్యత రవ్వంత తక్కువ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర ఇవ్వటంలేదు. రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర సంస్థలే ఇలా చేస్తున్నప్పుడు.. ప్రైవేటు వ్యాపారులు రైతుకు మద్దత ధర ఇస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. నూతన చట్టాల ద్వారా వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులను నిండా ముంచడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. 

ఒప్పంద వ్యవసాయం కార్పొరేట్లకోసమే..! 

మోదీ సర్కారు గొప్పగా ప్రతిపాదించిన ఒప్పంద వ్యవసాయం రైతులకన్నా కార్పొరేట్‌ సంస్థలకే అనుకూలమని ఎన్‌ఆర్‌ఏఎస్‌ స్పష్టంచేసింది. కొత్త ఒప్పంద వ్యవసాయ చట్టం తొలుత రైతుకు మేలుచేసేలా కనిపించినా.. దీర్ఘకాలంలో తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించింది. రైతులకు, కార్పొరేట్‌ సంస్థలకు మధ్య జరిగే ఒప్పందాలు రానురాను కార్పొరేట్లకు అనుకూలంగా మారుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. పంటలపై పెద్దపెద్ద వ్యాపారులు భారీగా పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదని నివేదిక హెచ్చరించింది. వారంతా వ్యాపార ధోరణిలోనే ఆలోచిస్తారు తప్ప.. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోరు. అధిక లాభాల కోసం అర్బన్‌, గ్లోబల్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా రైతులతో పంటలను సాగు చేయిస్తారు. అది రైతులతోపాటు పంటల సాగు విధానానికి కూడా ప్రమాదకరమని ఎన్‌ఆర్‌ఏఎస్‌ హెచ్చరించింది.