బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 14:32:22

ఈ 23 లోగా పరీక్షల నిర్వహణపై సీబీఎస్‌ఈ నిర్ణయం

ఈ 23 లోగా పరీక్షల నిర్వహణపై సీబీఎస్‌ఈ నిర్ణయం

ఢిల్లీ : 10వ తరగతి, 12వ తరగతి పెండింగ్‌ పరీక్షలను నిర్వహించేది లేనిది సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌(సీబీఎస్‌ఈ) ఈ నెల 23వ తేదీలోగా తేల్చనుంది.  ప్రస్తుత కరోనా వైరస్‌ పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం గడిచిన బుధవారంనాడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఎస్‌ఈ కౌన్సిల్‌ రూపేశ్‌ కుమార్‌ కోర్టుకు విన్నవిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిపై బోర్డు అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తమ నిర్ణయాన్ని ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయనున్నట్లు కోర్టుకు విన్నవించారు. కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌(సీఐఎస్‌సీఈ) సైతం విద్యార్థులు పరీక్షలను రాసేది లేనిది తేల్చుకోవాల్సిందిగా పేర్కొంటూ తన తుదిగడువును 24వ తేదీకి పొడిగించింది. 22వ తేదీనాటికే ఓ ప్రత్యామ్నాయ విధానాన్ని చూపనున్నట్లు వెల్లడించింది.

పరీక్షలను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సైతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిషాంక్‌కు లేఖ రాశారు. వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఐసీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ సాధ్యంకాదని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు విన్నవించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు జులై 1-15 మధ్య నిర్వహించాల్సింది ఉంది. ఈ పరీక్షలకు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు హాజరైతారు.  


logo