ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 02:10:40

సీబీఎస్‌ఈ సిలబస్‌ కుదింపు

సీబీఎస్‌ఈ సిలబస్‌ కుదింపు

  • 9-12 తరగతులకు 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం
  • కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌ను 30 శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచమంతా అల్లాడుతున్నది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకంగా మారి విద్యాసంవత్సరానికి అడ్డుపడుతున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై భారం తగ్గించాలని సీబీఎస్‌ఈకి అభ్యర్థనలు వెల్లువెత్తాయి. దీంతో కీలక అంశాలను కొనసాగిస్తూ 30శాతం సిలబస్‌ తగ్గించాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. సిలబస్‌ కుదింపు కోసం దేశవ్యాప్తంగా విద్యావేత్తల నుంచి సలహాలు స్వీకరించామని, మొత్తం 1.5లక్షల మందికి పైగా సూచనలు ఇచ్చారని తెలిపారు. డెమొక్రసీ అండ్‌ డైవర్సిటీ, డిమోనటైజేషన్‌, నేషనలిజమ్‌, సెక్యులరిజమ్‌ తదితర చాప్టర్లు తొలిగించిన సెలబస్‌లో ఉన్నాయి. కాగా, కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌(సీఐఎస్‌సీఈ) బోర్డు కూడా సిలబస్‌ను 25 శాతం తగ్గించింది. ఇదిలా ఉండగా, ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు కసరత్తు చేస్తున్నామని, జూలై 15లోగా మార్గదర్శకాలను విడుదల చేస్తామని మద్రాస్‌ హైకోర్టుకు కేంద్రం సోమవారం తెలిపింది. 


logo