గురువారం 02 జూలై 2020
National - Jun 26, 2020 , 01:27:56

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు

  • సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షలు రద్దు 
  • 10, 12 క్లాసుల పెండింగ్‌ 
  • పరీక్షలపై సుప్రీంకోర్టుకు వెల్లడి
  • అంతర్గత మదింపుతో ఫలితాలు 
  • పరీక్షలపై సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ 

న్యూఢిల్లీ, జూన్‌ 25: 10, 12వ తరగతులకు సంబంధించిన మిగిలిపోయిన (పెండింగ్‌) పరీక్షలను రద్దుచేస్తున్నట్టు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు ప్రకటించాయి. 12వ తరగతికి సమీప భవిష్యత్తులో పరీక్షలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తామని సీబీఎస్‌ఈ గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. అయితే, వాటికి హాజరు కావాలా వద్దా అనేది విద్యార్థుల నిర్ణయానికే వదిలేస్తామని పేర్కొంది. ఐసీఎస్‌ఈ మాత్రం రెండు తరగతుల పరీక్షలను పూర్తిగా రద్దుచేస్తున్నట్టు వెల్లడించింది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు గత ఫిబ్రవరి 15న ప్రారంభం కాగా లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలోనే ఆగిపోయాయి. 10వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు నిర్వహించాల్సి ఉండగా సగంలోనే నిలిచిపోయాయి. ఇంటర్నల్స్‌ ఆధారంగా  ఫలితాలు ప్రకటించేలా బోర్డులను ఆదేశించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాతో కూడిన బెంచ్‌ గురువారం విచారణ జరిపింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇస్తామని, ఆగస్టు మధ్య వరకు ఫలితాలను ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది. 

వచ్చే సెమిస్టరంతా ఆన్‌లైన్‌లోనే

న్యూఢిల్లీ: ఐఐటీ బాంబేలో వచ్చే సెమిస్టర్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్టు సంస్థ డైరెక్టర్‌ సుభాసిస్‌ ఛౌదూరి ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐటీ-బాంబే 62 ఏండ్ల చరిత్రలో క్యాంపస్‌లో విద్యార్థులు లేకుండా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటం ఇదే తొలిసారి. మిగతా విద్యాసంస్థలూ ఐఐటీ-బాంబే బాటలో నడిచే అవకాశాలున్నాయి.


logo