సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 17:37:06

స‌మాచార మార్పిడి కోసం సీబీఐసీ, సీబీడీటీల భాగస్వామ్యం

స‌మాచార మార్పిడి కోసం సీబీఐసీ, సీబీడీటీల భాగస్వామ్యం

ఢిల్లీ : రెండు సంస్థల మధ్య స‌మాచార‌ మార్పిడి కోసం ప్ర‌త్య‌క్ష ప‌న్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ప‌రోక్ష ప‌న్నులు, క‌స్ట‌మ్స్ కేంద్ర బోర్డు మంగ‌ళ‌వారం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై సీబీడీటీ ఛైర్మెన్ ప్రమోద్ చంద్ర మోడీ, సీబీఐసీ ఛైర్మన్  ఎం. అజిత్ కుమార్‌లు సంత‌కాలు చేశారు. రెండు సంస్థలకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. తాజా ఒప్పందం 2015లో సీబీడీటీ ,పూర్వపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అధిగమించి ఇక‌పై అమ‌లులోకి రానున్నది.

2015 ఏడాదిలో రెండు సంస్థ‌లు ఒక ఒప్పందం కుదుర్చు‌కున్న‌ప్ప‌టికీ  అప్ప‌టి నుంచి ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్త‌గా జీఎస్‌టీని ప్రవేశపెట్టడం, జీఎస్‌టీఎన్‌ను చేర్చడం , సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌(సీబీఈసీ) విభాగం పేరును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్  కస్టమ్స్‌గా (సీబీఐసీ) మార్చ‌డం వంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం  పురోగతితో సహా మారిన పరిస్థితుల‌ను మంగళవారం చేసుకున్న అవగాహన ఒప్పందంలో చేర్చారు.

ఈ అవగాహన ఒప్పందం సీబీడీటీ , సీబీఐసీ మధ్య క్ర‌మం త‌ప్ప‌కుండా సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కలుగుతుంది. స‌మాచార మార్పిడి స్థితిని స‌మీక్షించేందుకు గాను డేటా ఎక్స్ఛేంజ్ స్టీరింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఇది స‌మాచార మార్పిడి స్థితిని సమీక్షించడానికి, డేటా పంచుకొనే వ్య‌వ‌స్థ‌ ప్రభావాన్ని మరింత మెరుగు పరచడానికి గాను చర్యలు తీసుకుంటుంది. సీబీడీటీ ,సీబీఐసీ ల మధ్య సహకారంతోపాటు స‌మ‌న్వయం కోసం ఈ అవగాహన ఒప్పందం కొత్త శకానికి నాంది ప‌లుక‌నున్నది.


logo