బుధవారం 27 మే 2020
National - May 09, 2020 , 02:23:10

త్యాగయ్యను అంతమాట అంటావా..!

త్యాగయ్యను అంతమాట అంటావా..!

  • కమల్‌ హాసన్‌పై సంగీత విద్వాంసుల ఫైర్‌
  • క్షమాపణకు డిమాండ్‌

చెన్నై, మే 8: కర్ణాటక సంగీత ప్రపంచమంతా భగవత్‌ స్వరూపుడిగా కొలిచే వాగ్గేయకారుడు త్యాగరాజును నటుడు కమల్‌ హాసన్‌ భిక్షమెత్తుకునే వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని కష్టాలొచ్చినా జీవితాంతం శ్రీరాముడినే స్మరించి, స్తుతించి తరించిన పరమ భక్తుడైన ఆ హరిదాసును అవమానించటంపై ఆగ్రహావేశా లు పెల్లుబికుతున్నాయి. తమిళనాడులోని సంగీత విద్వాంసులంతా కమల్‌పై తీవ్రం గా మండిపడుతున్నారు. తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. నటుడు విజయ్‌సేతుపతితో ఇన్‌స్టాగ్రాంలో ఇటీవల లైవ్‌లో మాట్లాడిన కమల్‌.. త్యాగరాజు శ్రీరామచంద్రుడిని స్తుతిస్తూ బిచ్చమెత్తుకొనేవాడని అభ్యంతరకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన గాయకుడు పాల్ఘాట్‌ రాంప్రసాద్‌, తక్షణం కమల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఓ పిటిషన్‌ను ప్రారంభించగా, ఇప్పటికే 19,293 మంది సంగీత విద్వాంసులు సంతకాలు చే శారు. త్యాగరాజస్వామి గొప్ప హరిదాసు అని మల్లాది సోదరుల్లో ఒకరైన మల్లాది శ్రీరామప్రసాద్‌ అన్నారు. ప్రముఖ మృదంగం విద్వాంసు డు తిరువరూర్‌ భక్తవత్సలం, గాయని మహతి సైతం కమల్‌పై మండిపడ్డారు.

ఆయన రచనలు నేటికీ పాఠ్యగ్రంథాలు

త్యాగరాజు కర్ణాటక సంగీతానికి మూలస్తంభంలాంటివారు. ఆయన సృజించిన కృ తులు ఇప్పటికీ కర్ణాటక సంగీతకారులకు పాఠ్యగ్రంథంగాకొనసాగుతున్నాయి. కోట్ల మంది సంగీతప్రియులను భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. దక్షిణాదిలో పుట్టిన భక్తిఉద్యమంలో త్యాగరాజు పాత్ర వెలకట్టలేనిది. శ్రీరాముడినే పరమ ప్రభువుగా కీర్తించిన త్యాగరాజు ఊరూరా తిరుగుతూ ప్రజలను భక్తి ఉద్యమంవైపు మళ్లించారు. అంతటి చారిత్రక పురుషున్ని అవమానించటంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. 


logo