సోమవారం 30 మార్చి 2020
National - Mar 11, 2020 , 14:39:43

కేరళలో కారు బీభత్సం.. నలుగురు విద్యార్థినులకు తీవ్రగాయాలు

కేరళలో కారు బీభత్సం.. నలుగురు విద్యార్థినులకు తీవ్రగాయాలు

కేరళలోని అలప్పుజా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ కారు డ్రైవర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. వేగంగా వెళ్తున్న కారు.. సైకిల్‌పై వస్తున్న ఓ విద్యార్థినిని ఢీకొట్టింది. అనంతరం, అదే స్పీడులో .. ఎదురుగా ఉన్న బైక్‌ను తప్పించబోయి, నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. విద్యార్థినులు పక్కనే ఉన్న కాలువలో ఎగిరిపడ్డారు. ఒళ్లు గగుర్లు పొడిచే ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసుల వివరాల మేరకు.. శ్రీనారాయణ ఉన్నత పాఠశాలకు చెందిన అనఖా అనే విద్యార్థిని, పాఠశాల నుంచి సైకిల్‌పై తిరిగొస్తుండగా.. వేగంగా వస్తున్న కారు ఢీకొట్టిందని తెలిపారు. అనంతరం, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అర్చన, చందనా, రాఖి అనే మరో ముగ్గురు విద్యార్థినుల పైకి దూసుకెళ్లింది. కారు వేగానికి విద్యార్థినులు ఎగిరి పక్కనే ఉన్న కాలువలో పడ్డారు. 

ప్రమాదంలో గాయపడిన అనఖా అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మిగితా విద్యార్థునుల కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వారికి కాలమాస్సరీ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌, ఓ ప్రయాణికుడు సైతం గాయపడ్డారు. వారు కొట్టాయం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు.  డ్రైవర్‌ కోలుకున్న అనంతరం అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.


logo