గురువారం 26 నవంబర్ 2020
National - Sep 25, 2020 , 16:40:12

ఉప ఎన్నిక‌ల‌పై 29న నిర్ణ‌యం: సీఈసీ అరోరా

ఉప ఎన్నిక‌ల‌పై 29న నిర్ణ‌యం: సీఈసీ అరోరా

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా ఒక లోక‌స‌భ స్థానానికి, 64 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రుగాల్సిన ఉప ఎన్నిక‌ల‌పై సెప్టెంబ‌ర్ 29న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (సీఈసీ) సునీల్ ఆరోరా చెప్పారు. ఉప ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి ప‌లు అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయ‌ని, ఆ అభ్య‌ర్థ‌న‌లు అన్నింటిని ప‌రిశీలించి ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల అధికారులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో స‌మ‌గ్రంగా చ‌ర్చించి ఎన్నిక‌ల తేదీని ఖ‌రారు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

బీహార్‌లోని వాల్మీకి న‌గ‌ర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రుగాల్సి ఉంది. ఆ 64 స్థానాల్లో 27 స్థానాలు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనే ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌ యువ నాయ‌కుడు జ్యోతిరాదిత్య సింథియా అప్ప‌టి సీఎం క‌మ‌ల్‌నాథ్‌తో విభేదించి త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో క‌లిసి బీజేపీలో చేరారు. దీంతో క‌మ‌ల్‌నాథ్ స‌ర్కారు కుప్ప‌కూలింది. అదేస‌మ‌యంలో సింథియా వ‌ర్గం ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటుప‌డింది. అందుకే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగాల్సిన అసెంబ్లీ స్థానాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌ర్వాత అత్య‌ధికంగా గుజ‌రాత్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఎనిమిదేసి స్థానాలకు ఉప ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. మ‌ణిపూర్‌లో ఐదు, అసోం, జార్ఖండ్‌, కేర‌ళ‌, నాగాలాండ్‌, త‌మిళ‌నాడు, ఒడిశా రాష్ట్రాల్లో రెండేసి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.