శనివారం 23 జనవరి 2021
National - Nov 28, 2020 , 13:12:27

అమెజాన్ పై చర్యలు తీసుకోవాలన్నసీఏఐటి

అమెజాన్ పై చర్యలు తీసుకోవాలన్నసీఏఐటి

 ముంబై : ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటి) కేంద్ర సర్కారును కోరింది. నిబంధనలు పాటించని అమెజాన్ పై అంత తక్కువ జరిమానా ఎలా విధిస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రభుత్వం విధించిన రూల్ ఉల్లంఘించినప్పటికీ కఠిన చర్యలు తీసుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లకు తమ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే ఉత్పత్తుల గురించి అవి ఏ దేశంలో తయారయ్యాయి వంటి అన్నివివరాలను కస్టమర్లకు తప్పనిసరిగా ఇవ్వటం లేదని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా , అందుకు సమాధానం ఇవ్వని , నిబంధనలు పాటించని క్రమంలో అమెజాన్ పై చర్యలు తీసుకోవాలని సిఏఐటి కేంద్రాన్నిడిమాండ్ చేసింది. అమెజాన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజానికి కేంద్ర సర్కార్ 25 వేల రూపాయల ఫైన్ విధించింది.

వేల కోట్ల వ్యాపారం చేస్తున్న అమెజాన్ కు అంత తక్కువ జరిమానా విధించడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థకు రూ. 25000 ఒక లెక్కనా అంటూ మండిపడింది. నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్ సంస్థపై ఇంకోసారి తప్పు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది . కనీసం వారం రోజుల పాటు అమెజాన్ పై నిషేధం విధించాలని కేంద్ర సర్కార్ ని కోరింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్.

అమెజాన్ వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కలిగిన నష్టానికి సమానంగా జరిమానా విధించాలని, వస్తువుల తయారీ వివరాలను ప్రభుత్వానికి, కస్టమర్లకు అందించకుండా తప్పు చేసిన ఈ కామర్స్ సంస్థపై ప్రస్తుతం ఏడు రోజుల బ్యాన్ విధించాలని, మరోమారు తప్పు చేస్తే 15 రోజుల బ్యాంక్ విధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బిసి భార్టియా, సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండే వాలా ఓ ప్రకటనలో కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo