బుధవారం 03 జూన్ 2020
National - Feb 02, 2020 , 06:38:27

బడాయి బడ్జెట్‌!

బడాయి బడ్జెట్‌!
 • రూ.30,42,230 కోట్లతో నిర్మలమ్మ పద్దు
 • జీడీపీ వృద్ధిరేటు 10 శాతం సాధిస్తామని ప్రకటన
 • మూడో ఏడాదీ ద్రవ్యలోటును అరికట్టలేని పరిస్థితి
 • రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ
 • గ్రామీణాభివృద్ధికి, గ్రామీణ ఉపాధి పథకానికి భారీగా నిధుల కోత
 • రక్షణరంగానికి నామమాత్రం పెంపు
 • ప్రైవేటీకరణ దిశగా ఎల్‌ఐసీ, రైల్వేలు!
 • బడ్జెట్‌పై ఆర్థిక నిపుణుల పెదవి విరుపు
 • సమస్యలను సర్కారు అంత తేలికగా అధిగమించలేదని వ్యాఖ్యలు
 • బడ్జెట్‌ ముఖ్యాంశాలు
 • ఐపీవో ద్వారా ఎల్‌ఐసీ వాటాల విక్రయం
 • 2020-21లో ద్రవ్యలోటు 3.5 శాతంగా అంచనా
 • ఆధార్‌కార్డు ఆధారంగా తక్షణమే పాన్‌కార్డు
 • ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌
 • పీపీపీ విధానంలో రై

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఓవైపు వెనక్కి లాగుతున్న ఆర్థిక పరిస్థితి.. మరోవైపు వాటిని ఒప్పుకోలేని అశక్తత. ఈ నేపథ్యంలో వాస్తవాలతో సంబంధం లేకుండా బడాయితో ఘనమైన లక్ష్యాల ప్రకటన. కానీ, వాటిని సాధించటానికి అవసరమైన కచ్చితమైన ప్రణాళికలు లేని దుస్థితి! రూ.30,42,230 కోట్లతో ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌ స్థూల స్వరూపమిదీ. జీడీపీ వృద్ధిరేటును 10 శాతానికి తీసుకెళ్తామని, అన్నదాతల ఆదాయాన్ని మరో రెండేండ్లలో రెట్టింపు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. కానీ, అన్నదాతలే కాదు.. ఆర్థిక నిపుణులూ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మూడీస్‌ వంటి ఆర్థికసంస్థలు.. దేశ ఆర్థికరంగానికి గుదిబండగా మారిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అంత త్వరగా పరిష్కారం అయ్యే పరిస్థితులు లేవని హెచ్చరించాయి. 


మరోవైపు, వ్యవసాయానికి  నిర్మల భారీగానే నిధులు కేటాయించినప్పటికీ.. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, గ్రామీణాభివృద్ధి రంగానికి నిధులను తగ్గించారు. ఆకాంక్షల భారత్‌, ఆర్థికాభివృద్ధి, సంరక్షించే సమాజం- నినాదాలతో నిర్మల తన రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2.40 గంటలపాటు ఏకధాటిగా అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపించిన ఆర్థికమంత్రిగా నిలిచినా.. కోటి ఆశలతో ఎదురుచూసిన మధ్యతరగతి నుంచి ఇటు రాష్ట్రప్రభుత్వాల వరకూ.. బడ్జెట్‌ను చూసి ఉసూరుమనిపించారు. ఓవైపు ఆదాయం పన్నులో కోతలు విధిస్తూ కొత్త శ్లాబులను ప్రకటిస్తూనే.. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను వదులుకుంటేనే అని మెలిక పెట్టారు. ఇక.. కేంద్రం నుంచి ఈసారైనా నిధులు అందకపోతాయా అన్న రాష్ర్టాలకు మొండిచెయ్యే చూపించారు. పన్నుల నుంచి రాష్ర్టాలకు 41 శాతం వాటాను ఇవ్వాలన్న 15వ ఆర్థికసంఘం సిఫారసును ఆమోదిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. 14వ ఆర్థికసంఘం 42 శాతం వాటాను సిఫారసు చేయగా.. ప్రస్తుతం దానిని ఒకశాతం తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యంత పెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ  అమ్మకానికి, రైల్వేల ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచారు.


దేశ ప్రజల ఆదాయాన్ని, కొనుగోలుశక్తిని పెంచటమే లక్ష్యంగా కొత్త బడ్జెట్‌ను రూపొందించామని ప్రకటిస్తూ  ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ వరుసగా రెండో ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థికవ్యవస్థ బలంగా ఉన్నదని, ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా నిలువరించగలిగామని పేర్కొన్నారు. మధ్యతరగతి, వేతనజీవుల ఆదాయం పన్నుకు సంబంధించి కొత్త శ్లాబులను ప్రకటించారు. కంపెనీలకు డివిడెండ్‌ పన్నును రద్దు చేశారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిపారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యమిచ్చారు. పదేండ్లలో ఎన్నడూలేనంతగా నెమ్మదించిన ఆర్థికవ్యవస్థకు జవసత్వాలు కల్పించటానికి ప్రయత్నించారు. అయితే, కీలకమైన గ్రామీణాభివృద్ధికి, ఉపాధిహామీ పథకానికి నిధులను తగ్గించారు. రక్షణరంగానికి కేటాయింపులను నామమాత్రంగానే పెంచారు. రవాణారంగానికి కీలకమైన రైల్వేలకు పెద్దగా సాయాన్ని ప్రకటించలేదు.


వ్యవసాయరుణాల లక్ష్యం.. రూ.15 లక్షల కోట్లు

అన్నదాతల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయాలన్న సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. ఇందుకోసం 16 అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. వ్యవసాయం, దాని అనుబంధరంగాలకు కలిపి మొత్తంగా రూ.2.83 లక్షల కోట్లను కేటాయించారు. రైతులకు రూ.15 లక్షల కోట్ల వరకు రుణాలను ఇవ్వాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతుకూలీలకు ఉపాధి కల్పించే ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి’ కేటాయింపుల్లో 13 శాతానికి పైగా కోత విధించారు. ఇతర గ్రామీణాభివృద్ధి పథకాలకు కూడా నిధుల కేటాయింపులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు, దేశ మౌలికరంగానికి ఊతమిచ్చేందుకు, ఉద్యోగ కల్పనకు రానున్న ఐదేండ్లలో రూ.103 లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 


వేతన జీవులకు ఆశ-నిరాశ

మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఎంతో ఆశతో ఎదురుచూసే ఆదాయంపన్ను (ఐటీ)కు సంబంధించి ఆర్థికమంత్రి కొన్ని వరాలు ఇచ్చినట్టుగానే ఇచ్చి ఇప్పటి వరకూ ఉన్న రాయితీలను, మినహాయింపులను లాగేసుకున్నారు. కొత్తగా ప్రకటించిన శ్లాబుల ప్రకారం.. వేతనజీవులకు పన్నుభారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు కనిపించినప్పటికీ.. ఇప్పటివరకూ అమలులో ఉన్న పన్ను మినహాయింపులను (పిల్లల స్కూల్‌ ఫీజులు, బీమా ప్రీమియం, పీఎఫ్‌ తదితరమైనవి) వదులుకుంటేనే ఈ కొత్త శ్లాబులు వర్తిస్తాయి. లేదంటే, పాత పన్ను రేట్ల ప్రకారం ఆదాయంపన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యారంగంలో మౌలికవసతుల కల్పనకు, నిపుణులైన ఉపాధ్యాయులను ఆకర్షించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ప్రభుత్వం ప్రోత్సహించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. 


విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయించారు. నైపుణ్యాభివృద్ధి కోసం మరో రూ.3,000 కోట్లకుపైగా కేటాయించారు. త్వరలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. మరో కీలకరంగమైన  ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్‌ పథకం జాబితాలోని దవాఖానలు లేని ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల్లో దవాఖానలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీని ప్రైవేటీకరించే దిశగా నిర్మల చర్యలను ప్రకటించారు. ఆ సంస్థలో ప్రభుత్వ వాటాలను కొంతమేర విక్రయిస్తామని తెలిపారు. మరోవైపు, ద్రవ్యలోటుకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించటంలో మాత్రం మోదీ సర్కార్‌ వరుసగా మూడో ఏడాది కూడా విఫలమైందని బడ్జెట్‌ ద్వారా వెల్లడైంది. ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది 3.8 శాతం వద్ద నిలిచింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.5శాతంగా నిర్దేశించారు. 


రక్షణరంగానికి స్వల్ప పెంపు 

మోదీ హయాంలో సైన్యానికి గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నామని, భారత్‌ను సైనికపరంగా శక్తిమంతంగా మలుస్తున్నామన్న చెబుతున్నప్పటికీ.. బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రాధాన్యం కనిపించకపోవటం విశేషం. రక్షణ రంగానికి కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం ఈసారి నామమాత్రంగా పెంచింది. ఈ రంగానికి రూ.3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. గత ఏడాది కేటాయింపులతో (రూ.3.18లక్షల కోట్లు)తో పోలిస్తే ఈసారి 5.8 శాతం మాత్రమే పెంచారు. సవరించిన అంచనాలను బట్టి చూస్తే ఈ పెంపు మరింత తక్కువ (1.9 శాతం మాత్రమే). మరోవైపు, త్వరలో 150 రైళ్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుపుతామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2019 మార్చి-2021 మార్చి మధ్య కాలంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 2.62 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనావేసింది. దేశీయ తయారీరంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో గృహోపకరణాలు, పాదరక్షలు, ఎలక్ట్రిక్‌ పరికరాలు, స్టేషనరీ, ఆటబొమ్మలు తదితరాలపై దిగుమతిసుంకాన్ని నిర్మల పెంచారు. ప్రభుత్వరంగసంస్థల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల చెప్పారు. 


ఆశాజనకంగా లేదన్న ఆర్థిక నిపుణులు

బడ్జెట్‌లో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం లభించింది. ఈ మేరకు మొత్తం ఖర్చు 13 శాతం పెరిగింది. అయితే, ఈమాత్రం పెరుగుదలతో, కొత్తపన్నుశ్లాబులతో ఆర్థికరంగంలో ప్రస్తుతం నెలకొన్న నిరాశజనక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ మూడీస్‌ ఇన్‌వెస్టర్‌ సర్వీస్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లు భారత ప్రభుత్వం ఊహించినంత స్వల్పవ్యవధిలో తొలగిపోకపోవచ్చని, అవి దీర్ఘకాలంపాటు కొనసాగవచ్చని హెచ్చరించింది. జీడీపీ వృద్ధిరేటును 10 శాతంగా నిర్దేశించుకున్నామని ఆర్థికమంత్రి ఘనంగా ప్రకటించారు. కానీ, ప్రస్తుతం అది మూడు నాలుగు శాతానికి కూడా లేకపోవచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ప్రకటించిన లక్ష్యం వాస్తవాలకు దూరంగా ఉందని అంటున్నారు.


గృహ, పట్టణాభివృద్ధి శాఖకు రూ.50,000 కోట్లు

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.50,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ మిషన్‌కు ఈసారి కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ పథకానికి 2019-20లో 1,300 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2,300 కోట్లు కేటాయించారు. మరో కీలక పథకం స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు కూడా కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. గతేడాది రూ.3,450 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.6,450 కోట్లకు పెంచారు. మరోవైపు, అమృత్‌ పథకానికి రూ.7,300 కోట్లు కేటాయించారు. మెట్రో ప్రాజెక్టులకు సుమారు రూ.17,482 కోట్లు కేటాయించగా, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీకి రూ.4 కోట్లు కేటాయించారు.  


న్యూస్‌ప్రింట్‌పై దిగుమతి సుంకం తగ్గింపు

ఢిల్లీ, ఫిబ్రవరి 1: న్యూస్‌ప్రింట్‌పై దిగుమతి సంకాన్ని ఐదుశాతం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం న్యూస్‌ప్రింట్‌, తేలికపాటికాగితంపై 10శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. కేంద్రం దిగు మతి సుంకాన్ని విధించడంతో తాము గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ పలుమార్లు తన దృష్టికి తీసుకొచ్చిందని మంత్రి చెప్పారు.  వారి విజ్ఞాపనల మేరకు దిగమతి సుం కాన్ని తగ్గించినట్టు చెప్పారు. దేశంలో ఏటా 2.5 మిలియన్‌ టన్నుల న్యూస్‌ప్రింట్‌ వినియోగిస్తుండగా.. స్వదేశీ మిల్లు ల ద్వారా ఒక మిలియన్‌ టన్ను మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ తెలిపింది. 


ఎన్నికల సంఘానికి రూ.269 కోట్లు

కేంద్ర ఎన్నికల సంఘానికి బడ్జెట్‌లో రూ.269 కోట్లు కేటాయించారు. గతేడాది 255.46 కోట్లు కేటాయించగా, ఈసారి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి.  ఈ మొత్తాన్ని.. వివిధ ఎన్నికల సందర్భంగా వెచ్చించిన మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.


27,000 కి.మీ.కు గ్యాస్‌ గ్రిడ్‌ విస్తరణ!

జాతీయ సహజ వాయువు పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ (గ్యాస్‌ గ్రిడ్‌)ను ప్రస్తుతమున్న 16,200 కి.మీ. నుంచి 27,000 కి.మీ.కు విస్తరించనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. 2030 నాటికి సహజవాయువు ఇంధన వాటాను 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బడ్జెట్‌ స్వరూపం (రూ.కోట్లలో)


2019-20 బడ్జెట్‌ అంచనా
2019-20 సవరించిన అంచనా
2020-21 బడ్జెట్‌ అంచనా
రెవెన్యూ రాబడులు
19,62,761
18,50,101
20,20,926
మూలధన రాబడులు
8,23,588
8,48,451
10,21,304
మొత్తం రాబడులు
27,86,349
26,98,552
30,42,230
రెవెన్యూ ఖాతా
24,47,780
23,49,645
26,30,145
మూలధన ఖాతా
3,38,569
3,48,907
4,12,085
మొత్తం వ్యయం
27,86,349
26,98,552
30,42,230
రెవెన్యూ లోటు
4,85,019
4,99,544
6,09,219
ద్రవ్య లోటు
7,03,760
7,66,846
7,96,337
ప్రాథమిక లోటు
43,289
1,41,741
88,134
logo