సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 01:24:35

సీఏఏపై ప్రస్తావించలేదు

సీఏఏపై ప్రస్తావించలేదు

ట్రంప్‌,మోదీ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రస్తావనే రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శృంగ్లా తెలిపారు.

  • మతస్వేచ్ఛపై ట్రంప్‌ మోదీ సానుకూలంగా మాట్లాడారు
  • ప్రధానంగా ఐదు అంశాలపై చర్చ జరిగింది
  • భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ట్రంప్‌,మోదీ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రస్తావనే రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శృంగ్లా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్‌, మోదీ ఐదుగంటలకుపైగా చర్చలు జరిపారన్నారు. ఈ సందర్భంగా మత స్వేచ్ఛ అంశంపై ఇద్దరు నేతలు సానుకూల వాతావరణంలో మాట్లాడుకున్నారని చెప్పారు. ‘బహుళత్వం, వైవిధ్యం’ అనేవి రెండు దేశాలను కలిపి ఉంచుతున్న అంశాలని పేర్కొంటూ ఒకరినొకరు అభినందించుకున్నారని వెల్లడించారు. భారత్‌, అమెరికా మధ్య ప్రధానంగా భద్రత, రక్షణ, శక్తి, టెక్నాలజీ, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలపై చర్చ జరిగిందన్నారు. రక్షణ రంగంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్‌ చెప్పారన్నారు. వాణిజ్య పరంగా త్వరలో భారీ ఒప్పందం కుదుర్చుకోవాలని మోదీ, ట్రంప్‌ నిర్ణయించారన్నారు. పరస్పర సహకారానికి సంబంధించి ఇంధన రంగం ప్రాధాన్య అంశంగా మారిందని, ఈ ఏడాది అమెరికా నుంచి 900 కోట్ల డాలర్ల (దాదాపు రూ.64.7 వేల కోట్లు) పెట్టుబడులు ఆశిస్తున్నామన్నారు. ట్రంప్‌, మోదీ మధ్య పాకిస్థాన్‌ అంశం చర్చకు వచ్చిందని, ఈ సందర్భంగా సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళనలను మోదీ ప్రస్తావించారన్నారు. హెచ్‌-1బీ వీసా అంశాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారని, అమెరికా ఐటీ రంగానికి భారతీయ టెకీలు అందిస్తున్న సేవల గురించి గుర్తుచేశారని శృంగ్లా తెలిపారు.


logo