మంగళవారం 02 జూన్ 2020
National - Jan 14, 2020 , 02:48:47

కుక్కల్లా కాల్చేయాలి..

కుక్కల్లా కాల్చేయాలి..
  • సీఏఏ నిరసనకారులపై బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్య

కోల్‌కతా: బీజేపీ పశ్చిమబెంగాల్‌ శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను బీజేపీ పాలిత ప్రభుత్వాలు కుక్కల్లా కాల్చి పడేస్తున్నాయి. బెంగాల్‌లో కూడా అలాగే కాల్చిపారేయాలి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగినప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకుండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నాదియా జిల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో దిలీప్‌ ఘోష్‌ మాట్లాడుతూ ‘ఉత్తరప్రదేశ్‌, అసోం, కర్ణాటకల్లోని మా ప్రభుత్వాలు వీరిని (సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులను) కుక్కల్లా కాల్చి పారేస్తున్నాయి’ అని అన్నారు.

ఘోష్‌ వ్యాఖ్యలను విపక్షాలతోపాటు ఆయన సొంత పార్టీ నేతలు ఖండించారు. కేంద్ర మంత్రి బూబుల్‌ సుప్రియో ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ ఘోష్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. ‘దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలు బీజేపీ వైఖరిని, ఎజెండాను ప్రతిబింబిస్తున్నాయి’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ మండి పడింది. అయితే, దిలీప్‌ ఘోష్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసు కాల్పులు జరుపడం సరైన చర్యే’ అని అన్నారు. నిరసనకారులను హత్య చేయడం ద్వారా నియంతృత్వ పాలన అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని సీపీఎం ఆరోపించింది.


logo