శుక్రవారం 05 జూన్ 2020
National - May 16, 2020 , 10:57:23

వైర‌స్ ప్ర‌భావం.. త‌గ్గిన సిజేరియ‌న్లు

వైర‌స్ ప్ర‌భావం.. త‌గ్గిన సిజేరియ‌న్లు

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా ప్ర‌సూతి హాస్పిట‌ళ్ల‌లో కేసులు త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా సిజేరియ‌న్ స‌ర్జ‌రీలు కూడా త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది. హాస్పిట‌ళ్ల‌లో గ‌త ఏడాది మార్చితో పోలిస్తే.. ఈ ఏడాది మార్చి నెల‌లో డెలివ‌రీల సంఖ్య 43 శాతం త‌గ్గిన‌ట్లు ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. మార్చి నెల‌లోనే భార‌త్‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు ప్రారంభం అయ్యాయి.  ప్రైవేటు, ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల‌లో న‌మోదు అయిన శిశు జ‌న‌నాల సంఖ్య కూడా గ‌త ఏడాదితో పోలిస్తే త‌క్కువే అని తేలింది. గ‌త ఏడాది మార్చిలో సుమారు 17,1700 మంది శిశువులు జ‌న్మించిన‌ట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఏడాది అదే మార్చి నెల‌లో మాత్రం కేవ‌లం 971782 మంది మాత్ర‌మే పుట్టిన‌ట్లు తెలుస్తోంది. 

ఇక సిజేరియ‌న్ కేసుల్లో కూడా చాలా తేడా క‌నిపిస్తున్న‌ది. నిజానికి అత్య‌వ‌స‌ర కేసుల్లో మాత్ర‌మే సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తారు. ఇండియాలో సాధార‌ణంగా 5 నుంచి 15 శాతం వ‌ర‌కు ఇలాంటి కేసులు ఉంటాయి. అయితే ఆ కేసులు కూడా మార్చి నెల‌లో 46 శాతం త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ‌సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. ఇది కేవ‌లం గ‌త ఏడాది మార్చి నెల‌తో పోల్చిన లెక్క‌లు మాత్ర‌మే. అయితే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ నెల‌లో క‌ఠినంగా అమ‌లు చేశారు. ఆ నెల మొత్తం లాక్‌డౌన్‌లోనే ఉన్న‌ది. మార్చి నెల‌లోనే రికార్డు స్థాయిలో డెలివ‌రీ కేసులు త‌గ్గితే, ఇక ఏప్రిల్‌లో ఆ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఈ ఏడాది మార్చిలో హాస్పిట‌ళ్ల‌లో న‌మోదు అయిన డెలివ‌రీల‌ కేసుల సంఖ్య గ‌త  కొన్నేళ్ల‌లోనే అత్య‌ల్పం అని రికార్డులు చెబుతున్నాయి.


logo