మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 08:02:50

దేశంలో ‘బైపోల్స్‌’ పండుగ

దేశంలో ‘బైపోల్స్‌’ పండుగ

హైదరాబాద్‌ : దేశంలో మంగళవారం ఉప ఎన్నిక కోలాహలం నెలకొంది. పది రాష్ట్రాల్లో ఎన్నికలతో పండుగ వాతావరణం నెలకొంది. పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఒడిశా, నాగాలాండ్‌లోని పలు స్థానాలు ఖాళీ కాగా.. భారత ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందులో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్‌లో ఎనిమిది, యూపీలో ఏడు, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్‌, నాగాలాండ్‌లో రెండు చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి మంగళవారం పోలింగ్‌ ప్రారంభమైంది. నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మధ్యప్రదేశ్‌లో మార్చిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 25 మంది పార్టీని వీడి, బీజేపీలో చేరారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో సీఎం కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే మరో మూడు చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరణించడంతో మొత్తం 28 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరో తొమ్మిది ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తే మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంటుంది. 28 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించినా మ్యాజిక్‌ ఫిగర్‌కు కాంగ్రెస్‌ ఒక సీటు వెనుకపడే ఉంటుంది. అలాగే గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలకు ముందు పలువురు రాజీనామా చేయగా.. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

యూపీలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 93 మంది బరిలో ఉన్నారు. హత్రాస్‌ ఘటన నేపథ్యంలో ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జనతాదళ్-సెక్యులర్ ఎమ్మెల్యే సత్యనారాయణ మరణంతో కర్ణాటకలోని సిరా సీటు ఖాళీగా ఉంది. అలాగే ఆర్‌ఆర్‌నగర్‌ స్థానానికి సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశాలో టిర్టోల్, బాలాసోర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే మదన్ మోహన్ దత్తా, టిర్టోల్‌లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు చరణ్‌ దాస్‌ మరణించడంతో ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్‌లో డుమ్కా, బెర్మో సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. జేఎంఎం అధినేత, సీఎం హేమంత్‌ సోరెన్‌ డుమ్కా, బర్హైట్‌ స్థానాల్లో పోటీ చేయగా.. రెండుస్థానాల్లో విజయం సాధించడంతో డుమ్కా స్థానాన్ని వదులుకున్నారు.

బెర్మో స్థానంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్‌ సింగ్‌ మేలో మరణించారు. నాగాలాండ్‌లో పీపుల్స్‌ ఫ్రంట్‌కు చెందిన అసెంబ్లీ స్పీకర్‌ విఖో ఓ యోషు టీ తోరెచు మరణం అనంతరం కొహిమా జిల్లాలోని దక్షిణ అంగమి-1 స్థానంతో పాటు కిఫైర్‌ జిల్లాలోని పుంగ్రో కిఫైర్‌ సీటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రిషన్ హుడా మరణం కారణంగా ఖాళీగా ఉన్న సోనిపట్‌లోని బరోడా స్థానానికి భారత ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తోంది. 

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎన్నికల కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాటు చేసింది. సామాజిక దూరం పాటించేందుకు ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేయడంతో పాటు శానిటైజర్లు, గ్లౌజ్‌లు, హ్యాండ్‌వాష్‌, మాస్క్‌లు అందుబాటులో ఉంచింది. అలాగే కరోనాతో క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సాధారణ వ్యక్తులు సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వగా.. 5 నుంచి 6 గంటల మధ్య క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. వారి కోసం పీపీఈ కిట్లు సైతం అందుబాటులో ఉంచారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.