బుధవారం 21 అక్టోబర్ 2020
National - Oct 11, 2020 , 16:58:35

గుండెపోటుతో ట్రంప్ వీరాభిమాని బుస్స కృష్ణ మృతి

గుండెపోటుతో ట్రంప్ వీరాభిమాని బుస్స కృష్ణ మృతి

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని, జ‌న‌గామ‌ జిల్లా బ‌చ్చ‌న్న‌పేట మండ‌లం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ గుండెపోటుతో మృతిచెందారు. ఆదివారం మ‌ధ్యాహ్నం మెద‌క్ జిల్లా తూప్రాన్ ప‌ట్ట‌ణంలోని త‌న బంధ‌వుల ఇంట్లో టీ తాగూతు కృష్ణ ఒక్క‌సారిగా కుప్పుకూలిపోయారు. బంధువులు వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా కృష్ణ అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.

బుస్స కృష్ణ ట్రంప్‌ను ఎంత‌గా అభిమానించేవాడంటే ఆయ‌న కోసం ఏకంగా ఒక గుడిని నిర్మించి, అందులో ఆర‌డుగుల పొడ‌వుగ‌ల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహానికి నిత్య పూజ‌లు చేశాడు. ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే స్నాన‌పానాదుల పూర్తిచేసి ట్రంప్ పూజా కార్య‌క్ర‌మంలో మునిగిపోయేవాడు. ట్రంప్ కోసం నిర్మించిన గుడిని శుభ్రంగా తూడ్చి, ట్రంప్ విగ్ర‌హాన్ని శుద్ధిచేసి పూల‌మాల‌లు వేసి అలంక‌రించేవాడు. అనంత‌రం ట్రంప్ పేరుతో ప్రార్థ‌న చేసేవాడు. 

ఏడాది కాలంగా బుస్స కృష్ణ‌కు ఇదే దిన‌చ‌ర్య‌గా కొన‌సాగింది. గ‌త ఫిబ్ర‌వ‌రిలో ట్రంప్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు అత‌డిని క‌లుసుకోవాల‌ని కృష్ణ ఎంతో ఆశప‌డ్డాడు. కానీ, అందుకోసం అత‌ను చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అయినా నిరాశ చెంద‌కుండా కృష్ణ తాను ఎప్ప‌టికైనా ట్రంప్‌ను క‌లుస్తాన‌ని విశ్వాసం వ్య‌క్తంచేసేవాడు. కానీ చివ‌ర‌కు ట్రంప్‌ను క‌లువాల‌న్న త‌న కోరిక నెర‌వేర‌కుండానే గుండెపోటుతో మ‌ర‌ణించాడు. ‌‌   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo